
భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య
సాక్షి,బళ్లారి: మట్టి ఎద్దుల అమావాస్య పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బుధవారం మట్టి ఎద్దుల అమావాస్య పండుగ నేపథ్యంలో జిల్లాలోని కురుగోడు, గెణికెహాళు, భైరాపుర, బేవినహళ్లి, శ్రీధరగడ్డ, శంకరబండ తదితర అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతులు భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య పండుగను జరుపుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పంటలు వేసే ముందు వచ్చే అమావాస్య పండుగను రైతులు ఎంతో సంతోషంగా జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ముందస్తు వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని ముంగారు పంటలను వేయడానికి అన్నీ అనుకూలంగా మారడంతో రైతులు ఇంటింటా మట్టి ఎద్దులకు పూజలను మరింత ఉత్సాహంగా చేశారు.
పంటలు బాగా పండాలని..
అమావాస్య రోజున భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దులకు పూజలు చేసి, పంటలను వేయడం ద్వారా బాగా పంటలు పండుతాయని నమ్మకం ఉందని, దీంతో ప్రతి ఏటా పండుగను ఆచరిస్తున్నామని రైతులు తెలిపారు. రైతులు ఇంటింటా మట్టి ఎద్దుల అమావాస్య పండుగను ఆచరించిన తర్వాత పొలాల్లో ఎద్దులకు పూజలు చేసి ముంగారు(ఖరీఫ్) పంటలను సాగు చేస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. జిల్లాలో ఉత్సాహంగా, ఉల్లాసంగా మట్టి ఎద్దుల అమావాస్య పండుగ చేసుకుని ఖరీఫ్‌లో పంటలు సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం
ఇక ఖరీఫ్ పంటల సాగుకు అన్నదాతలు సంసిద్ధం

భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య