
కాంట్రాక్టర్ హత్య కేసు నిందితుడి ఇల్లు దహనం
హుబ్లీ: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణ శివారులో మంగళవారం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూర దారుణ హత్య కేసులో నిందితుడి ఇంటికి బుధవారం రాత్రి నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ హత్య కేసులో 5 మంది నిందితుల్లో సూత్రధారి నాగరాజ్ సౌదత్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫస్ట్ గ్రేడ్ కాంట్రాక్టర్ అయిన శివానంద కున్నూర(40)ను శిగ్గాంవి పట్టణ శివారులోని గంగిబావి క్రాస్ వద్ద మంగళవారం మారణాయుధాలతో నరికి చంపిన సంగతి తెలిసిందే. సదరు హత్య వీడియో దృశ్యాలు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా హతుడు శివానంద భార్య ఫిర్యాదు మేరకు శిగ్గాంవి పోలీసులు నాగరాజ్ సౌదత్తి, హనుమంత, అష్రఫ్, సుదీప్, సురేష్ అనే 5 మందిపై కేసు నమోదు చేశారు. ఆస్తి గొడవే ఈ హత్యకు కారణంగా ఫిర్యాదులో తెలిపారు. ఈ హత్య వల్ల కక్షలు చెలరేగిన నేపథ్యంలో శిగ్గాంవిలో 5 మంది సీఐలు, 7 మంది ఎస్‌ఐలు, 2 డీఏఆర్ వాహనాలతో పాటు 20 మందికి పైగా అదనపు పోలీస్ సిబ్బందితో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.