
ఉపాధి కూలీ ఇవ్వండి
కేజీఎఫ్: ఉపాధి హామీ కూలీ పనులు చేసి నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇవ్వలేదని పారాండహళ్లి గ్రామానికి చెందిన మహిళలు పంచాయతీ ఆఫీసు ముందు బైఠాయించారు. ఉపాధి పనులలో అక్రమాలు జరిగాయని ఈమధ్యనే గ్రామానికి చెందిన కొంతమంది పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులను అధికారులు నిలిపి వేశారు. ఎవరో ఫిర్యాదు చేయడం వల్ల పనులను నిలిపి వేసి, కూలీని కూడా ఇవ్వకపోవడం తగదని మహిళలు వాపోయారు. కొంతమంది ధనవంతులు వ్యక్తిగత కారణాల వల్ల ఉపాధిహామీ పనులను బంద్ చేయడానికి కుట్ర చేశారన్నారు. పీడీఓ మంజునాథ్ మాట్లాడుతూ మూడు రోజులలో కూలీ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
భవనం మీద నుంచి పడి మృతి
బనశంకరి: నిర్మాణంలో ఉన్న బృహత్ కట్టడం మీద నుంచి పడి యువతి మృతి చెందింది. ఈ ఘటన నగరంలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చూడసంద్రలో మూలతః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని (23) అనే యువతి నివాసం ఉంటుంది. స్నేహితులతో కలిసి నిర్మాణ దశలో ఉన్న కట్టడంపైకి నందిని వెళ్లింది. ఈ సమయంలో అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే కన్నుమూసింది. పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుత్రికి తరలించారు.
షేర్ల ట్రేడింగ్ పేరిట
రూ.26 లక్షల టోకరా
మైసూరు: వారసత్వ నగరిలో సైబర్ మోసాలు తగ్గడం లేదు. పేరొందిన ప్రైవేట్ బ్యాంకు పేరిట నకిలీ ట్రేడింగ్ నెట్‌వర్క్ ద్వారా దుండగులు మైసూరువాసికి రూ.26 లక్షల మేర టోపీ వేశారు. మైసూరులోని విశ్వేశ్వరనగర నివాసి (42) నెల రోజుల క్రితం ఇన్‌స్టాలో షేర్ల ట్రేడింగ్ ప్రకటనను చూశాడు. అందులో పెట్టుబడి పెట్టాలని లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే అతని మొబైల్ నంబర్ ఓ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ అయింది. ఆ గ్రూప్‌లో షేర్ల వ్యాపారానికి సులభంగా ఉండేలా తమ వెబ్‌సైట్‌లో అకౌంట్ తెరవాలని సూచించారు. ఆశపడిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచారు. ఆ తర్వాత దశల వారీగా రూ.26 లక్షలను పెట్టుబడి పెట్టి వంచనకు గురయ్యాడు. బాధితుడు సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇళ్లు, ఆటోల దొంగ అరెస్టు
బనశంకరి: ఇళ్లు, వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను మంగళవారం రాజగోపాలనగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.33.35 లక్షల విలువచేసే సొత్తును సీజ్ చేశారు. పరప్పన అగ్రహార నివాసి నాగేశ్ పట్టుబడిన దొంగ. 208 గ్రాములు బంగారు నగలు, 358 గ్రాములు వెండి వస్తువులు, ఆటోరిక్షా, 2 కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.33.35 లక్షలు గా పోలీసులు అంచనా వేశారు. హెగ్గేనహళ్లి క్రాస్ ఇంటి ముందున్న ప్యాసింజర్ ఆటోను చోరీ చేశాడు. పోలీసులు ఆటో కోసం గాలిస్తుండగా లగ్గరె సర్కిల్‌లో ఆటోలో వెళ్తూ కనిపించాడు. బెంగళూరు గ్రామాంతర జిల్లాలో పలు ఇళ్లలో, ఆటోలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇతని అరెస్ట్‌తో 7 కేసులు వీడిపోయాయి.

ఉపాధి కూలీ ఇవ్వండి

ఉపాధి కూలీ ఇవ్వండి