
జీడీకే–11 గనిలో కార్మికుడికి గాయాలు
గోదావరిఖని(రామగుండం): రామగుండం డివిజన్–1 పరిధి జీడీకే–11గనిలో జరిగిన ప్రమాదంలో జి.శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్‌కు గాయాలయ్యాయి. గనిలోని 15లెవల్ 15రేస్‌లో బ్లాస్టింగ్ కోసం నలుగురు కార్మికులు సపోర్టింగ్ కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. పైకప్పు సపోర్టింగ్ చేసిన తర్వాతే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా సేఫ్టీ సరిగా పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. నలుగురు పనిచేస్తున్న ప్రాంతంలో పైకప్పు కూలడంతో ముగ్గురు దూరం పరుగెత్తి ప్రమాదం నుంచి తప్పించుకోగా యాక్టింగ్ కోల్‌కట్టర్ శ్రీకాంత్‌పై బొగ్గు పెళ్లలు మెడపై పడడంతో గాయాలయ్యాయి. ఇతన్ని హుటాహుటిన గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోశం ఆసుపత్రికి చేరుకుని కార్మికున్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మైన్స్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో సేఫ్టీ గురించి మాట్లాడినా.. యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.