
వరదకు దారేది?
● కబ్జా కోరల్లో మత్తడి కాల్వలు
● నిర్జీవమైపోతున్న సిరిసిల్ల చెరువులు
● జలవనరులనూ వదలని కబ్జాదారులు
● పరాధీనంలో రూ.కోట్లు విలువైన ఆస్తులు
● పట్టింపులేని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు
సిరిసిల్లటౌన్: కబ్జాకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. అధికారుల పట్టింపులేమి తనం అక్రమార్కులకు కలసొస్తుంది. సిరిసిల్లలో నిబంధనలను అతిక్రమించి మత్తడికాల్వలు కబ్జాకు గురయ్యాయి. పట్టణ నడిబొడ్డున పారే చెరువుల మత్తడి(వ్యవసాయ) కాలువలు ఇప్పుడూ పరాధీనమయ్యాయి. సంబంధిత శాఖలు అటువైపు చూడకపోవడంతో చెరువులు జీవం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఏళ్ల తరబడిగా చెరువుల కాల్వలు(నాలాలు) దురాక్రమణ పాలైన తీరుపై సాక్షి ప్రత్యేక కథనం.
● సిరిసిల్ల చుట్టూ గొలుసు చెరువులు
పూర్వీకులు వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం సిరిసిల్ల చుట్టూ తొమ్మిది చెరువులు గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించారు. వర్షాలతో ఒక చెరువు నిండాక దాని కింద చెరువుకు నీరుపోయేలా తవ్వించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఇందులో రాయినిచెరువు, తుమ్మలకుంటలను నివాస స్థలాలుగా అభివృద్ధి చేయగా వాటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పట్టణానికి ఇరువైపులా ఉన్న కొత్తచెరువు, కార్గిల్‌లేక్ చెరువులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి నీటిపారుదల, మున్సిపల్‌శాఖల ఆధీనంలో ఉన్నాయి. అర్జున్‌కుంట, ఈదులచెరువు, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్నాయి. కొత్తచెరువు, కార్గిల్‌లేక్ స్థలాలు, మత్తడికాల్వలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకోవడంలో కినుక వహించడం విమర్శలకు తావిస్తోంది.
● నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయినిచెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం విస్తరించింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకే వరద పోటెత్తుతోంది. పై నుంచి వచ్చే వరదనీరు ఆయా ప్రాంతాల్లో నిలువకుండా వరదకాల్వలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపుకు గురువుతున్నాయి. ఇక చెరువుకట్టలను ఆనుకుని ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదన్న నిబంధనలకు భిన్నంగా పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామరకుంటలను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తచెరువు, కార్గిల్‌లేక్‌ల కాల్వలు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ లెవల్ స్థలాలు కబ్జాకు గురవడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల చెరువులు, కాల్వలకు 30 ఫీట్ల దూరంలోపే నిర్మాణాలు జరుగుతున్నాయని వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
● కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం
కార్గిల్‌లేక్, రాయినిచెరువు, తుమ్మలకుంట, కొత్తచెరువుల మత్తడికాల్వలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువు వందల కోట్లలోనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. ఒక్కో కాలువ 33 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ల పొడవుగా ఉండేవాటి విస్తీర్ణం వందల ఎకరాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో సగటున గజానికి రూ.30వేలకు తక్కువ లేదు. అందుకే అక్రమార్కులు అధికారులను మచ్చిక చేసుకుని తతంగం నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కాల్వల నుంచి గొలుసుకట్టు దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను కూడా అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సిరిసిల్లలో చెరువుల వివరాలు
చెరువు సర్వేనంబర్ విస్తీర్ణం కాలువ
(ఎకరాల్లో) (కి.మీ)
కొత్తచెరువు 1471 85.05 4
రాయినిచెరువు 703 152.10 3
ఈదులచెరువు 991 77.29 1.5
అర్జునకుంట 757 22.36 1
దేవునికుంట 1121 9.28 1.5
మైసమ్మకుంట 1294 11.02 1
దామరకుంట 232, 233 7.38 2
తుమ్మలకుంట 142, 143 29.23 2
వర్ధనికుంట – – –
కాల్వను సరిగ్గా నిర్మించలేదు
వెంకంపేట, పద్మనగర్ ప్రాంతాలు లోతట్టుగా ఉంటాయి. వర్షాలు పడితే బోనాల తదితర చెరువుల నుంచి మత్తడికాల్వలు సిరిసిల్లకు ప్రవహిస్తాయి. పైనుంచి వచ్చే వరదనీరు వెళ్లేందుకు బస్టాండు ప్రాంతంలో కాల్వ నిర్మించినా లాభం లేదు. పెద్దవర్షం పడితే చాలు నాలాలు నిండి నీరంతా షాపుల్లోకి, రోడ్డుపైకి వస్తుంది. ఏళ్లసంది సమస్యను ఇప్పుడైనా పరిష్కరించాలి.
– చిక్కుడు శ్రీనివాస్, వెంకంపేట

వరదకు దారేది?

వరదకు దారేది?

వరదకు దారేది?