
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కోరుట్లరూరల్: అనారోగ్యంతో బాధపడుతూ.. కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మైలారం గోపాల్ (53) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ యూ సుఫ్‌నగర్ పంచాయతీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవలే గుండెకు స్టంట్ వేశారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఊరు శివారులో ఉరేసుకున్నాడు. అటువైపు వెళ్లిన వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చా రు. గోపాల్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పురుగుల మందు తాగి వలసజీవి..
ధర్మపురి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వలస జీవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం తీగలధర్మారానికి చెందిన అలకుంట రాజశేఖర్‌కు ఎనిమిదేళ్ల క్రితం పట్టణానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వారికి ఓ కుమారుడు సంతానం. రాజశేఖర్ కొన్నాళ్లుగా దుబాయి వెళ్లి వస్తున్నాడు. జ్యోతి పుట్టింటి వద్ద ఉంటోంది. స్వగ్రామంలోనే కలిసి ఉందామని, త్వరగా ఇంటికి రావాలని జ్యోతి రాజశేఖర్‌ను పలుమార్లు ఫోన్‌లో కోరుతోంది. ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం రాజ శేఖర్ స్వగ్రామానికి వచ్చాడు. నెల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా.. జ్యోతి పుట్టింటికి వెల్లింది. కాపురానికి రావాలని రాజశేఖర్ పలుమార్లు కోరినా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురైన రాజశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగాడు. బంధువులు జగి త్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని పోలీ సులు తెలిపారు. మృతుడి తల్లి శంకరమ్మ ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇల్లు కట్టలేదని భార్య..
జూలపల్లి(పెద్దపల్లి): ఇల్లు కట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మెండె రజిత(35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. జూలపల్లికి చెందిన మెండె రజిత – చిన్నరాజయ్య భార్యాభర్తలు. తాము నివాసం ఉండే ఇల్లు పాతది కావడంతో కొత్తది నిర్మించాలని కొంతకాలంగా రజిత తన భర్తను కోరుతూ వస్తోంది. ఆయన ఎంతకూ ఆమె మాట వినలేదు. కొత్త ఇల్లు కట్టలేదు. మనస్తాపం చెందిన ఆమె.. జూన్ 26న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
రుద్రంగి గుట్టల్లో మృతదేహం?
రుద్రంగి(వేములవాడ): హాస్టల్ వెనుక మా మిడితోట పక్కన గల అడవిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం కోసం పోలీసులు గుట్టల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రుద్రంగి ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా గొర్లకాపరులు చూసి గ్రామస్తులకు చెప్పడంతో ఈ చర్చ మొదలైనట్లు తెలిపారు. అనుమానిత స్థలంలో గాలించినట్లు పేర్కొన్నారు. మృతదేహం దొరకలేదని, గురువారం సైతం గాలిస్తామని చెప్పారు.