ఇందిరమ్మకు బలం లేదని.. | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు బలం లేదని..

Jul 3 2025 4:45 AM | Updated on Jul 3 2025 4:45 AM

ఇందిరమ్మకు బలం లేదని..

ఇందిరమ్మకు బలం లేదని..

● ముందుకు సాగని ఇళ్ల గ్రౌండింగ్‌ ● ముహూర్తాల కోసం ఆగుతున్న లబ్ధిదారులు ● ఇళ్ల నిర్మాణం కోసం అధికారుల ఒత్తిడి

చొప్పదండి: ‘నా పేరు మీద బలం లేదట సార్‌. ఈ నెలాఖరుకు శ్రావణం వస్తుంది. అప్పుడే ఇళ్లు మొదలుపెడుతా. నాలుగు రోజులు ఓపిక పట్టండి సార్‌’.. అంటూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మార్కింగ్‌ ప్రక్రియ వేగం పుంజుకున్నా.. ఆశించినస్థాయిలో గ్రౌండింగ్‌ కావడం లేదు. నలుబై రోజుల క్రితమే ప్రొసీడింగ్‌లు అందించే ప్రక్రియ చేపట్టినా ఇంకా బేసిమెంట్‌స్థాయికి నిర్మాణాలు చేరడం లేదు.

ముహూర్తాలు లేవని..

ఇంటి నిర్మాణానికి ముహూర్తాలు చూడటం సాధారణ విషయమే. మే నెలాఖరులో ప్రొసీడింగ్‌ అందించే ప్రక్రియ చేపట్టడంతో జూన్‌ మొదటివారంలో చాలా మంది లబ్ధిదారులు ముగ్గుపోసి మార్కింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. నెలరోజుల్లో జిల్లావ్యాప్తంగా 8,219 మందిలో 62శాతం మంది మార్కింగ్‌ పూర్తి చేశారు. మరో మూడు వేల మంది ప్రస్తుతం ఆషాఢం కావడంతో ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా మానకొండూరు మండలానికి 852 ఇల్లు మంజూరు చేశారు. 423 ఇళ్లకు ముగ్గుపోశారు. బేసిమెంట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌, స్లాబల్‌ లెవల్‌లో 30 ఇండ్లే ఉండటం గమనార్హం. చొప్పదండి పట్టణంలో 110మందిని ఎంపిక చేయగా.. 84మంది మార్కింగ్‌ చేశారు. ముగ్గురు మాత్రమే బేసిమెంట్‌ స్థాయికి వచ్చారు. శ్రావణంలో ఇంటినిర్మాణం ప్రారంభిస్తామని చాలామంది చెబుతున్నారు.

పిల్లర్లకే రూ.లక్షన్నర

ఫిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. స్థలనాణ్యత, పునాది గట్టిగా ఉండాలనే భావనతో చాలామంది బేస్‌మెంట్‌కు బదులు ఫిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొదటి బిల్లు రావాలంటే లబ్ధిదారులు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. మరికొందరు కంపౌండ్‌, మొరంతో కలిపి రూ.రెండు లక్షల వరకు వెచ్చిస్తున్నారు.

శ్రావణం వస్తోంది

శ్రావణ మాసం సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో కార్యదర్శుల సూచన మేరకు ఇంటి మార్కింగ్‌ చేసుకొని వదిలేసిన వారు జూలై 27నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో యాభై నుంచి 70 శాతం వరకు అధికారుల ద్వారా మార్కింగ్‌ ప్రక్రియ పూర్తయినా వివిధదశల్లో ఉన్న ఇళ్లనిర్మాణం 15శాతం కూడా దాటలేదు.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు

మంజూరైనవి 8,219

మార్క్‌ అవుట్‌ చేసినవి 5,089

గ్రౌండింగ్‌ అయినవి 742

గ్రౌండింగ్‌ అయిన వాటిలో

బేసిమెంట్‌స్థాయి 511

రూఫ్‌ లెవల్‌ 128

రూఫ్‌ కంప్లీటెడ్‌ 103

మార్కింగ్‌ పూర్తి చేస్తున్నాం

ప్రొసీడింగ్‌ అందుకున్న లబ్ధిదారుల ఇండ్ల స్థలాలలో మార్కింగ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. లబ్ధిదారులు ఉత్సాహంగానే పనులు ప్రారంభిస్తున్నారు. జూన్‌ మొదటి వారంలోనే మెజారిటీ ఇళ్లకు మార్కింగ్‌ ప్రక్రియ స్టార్ట్‌ అయింది. ఇప్పుడిప్పుడే బేసిమెంట్‌ ప్రక్రియకు వస్తున్నాయి. ఫాలోఅప్‌ చేస్తున్నాం.

– వేణుగోపాల్‌, ఎంపీడీవో, చొప్పదండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement