
ఆర్వోబీ ఆక్రమణపై కొరడా
● ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన కమిషనర్ అయాజ్
జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించినవారికిపై బుధవారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. మే 26న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పార్కింగ్ పరిషాన్’ కథనానికి స్పందించారు. కమిషనర్ ఎండీ అయాజ్ పర్యవేక్షణలో సిబ్బంది ఆర్వోబీని ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారుల సామగ్రిని తొలగించారు. నెలరోజులుగా మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వివరాలు సేకరించారు. నిర్వహణ లేని వాటిని గుర్తించి, పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్ల అధారంగా అక్రమణలు తొలగించారు. నిజమైన వ్యాపారులు బ్రిడ్జి కింద రోడ్డుకు ఆరుఫీట్ల దూరంలో బిజినెస్ చేసుకోవాలని సూచించారు. ఆర్‌వోబీ కింద డబ్బాలు వేసుకొని నిజ మైన ఉపాధి పొందే వారికి న్యాయం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. టీపీవో శ్రీధర్, ఏఈ నరేశ్, శానిటరీఇన్స్‌పెక్టర్ మహేశ్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కరీంనగర్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. పోలీస్ గార్డులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే.మహేశ్వర్, వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య పాల్గొన్నారు.
ఇండోర్ తరహాలో డంప్‌యార్డు సమస్య పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ డంప్‌యార్డు సమస్యల పరిష్కారంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఇండోర్ తరహాలో కరీంనగర్ డంప్‌యార్డు సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. బుధవారం నగరంలోని డంప్‌యార్డును కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. డంప్‌యార్డుతో నగరంలోని చాలా డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఇండోర్‌లో గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నరహరి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే నరహరి కరీంనగర్‌కు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గదర్శనం చేస్తానని తెలిపారు. నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కట్ల సతీశ్, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, గంట శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆహార నాణ్యతపై నజర్
కరీంనగర్ అర్బన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించింది. వారికి అందించే ఆహార నాణ్యతను పక్కాగా పర్యవేక్షించాలని ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో అందించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడంతో పాటు పరీక్ష చేయాలని ఆదేశించింది. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి, గెజిటెడ్ ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ రోహిత్‌రెడ్డి నేతత్వంలో బుధవారం పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా పరీక్షించారు. ప్రతి శనివారం హాస్టళ్ల తీరుపై నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నారు. అన్ని హాస్టళ్లను తనిఖీ చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు.

ఆర్వోబీ ఆక్రమణపై కొరడా

ఆర్వోబీ ఆక్రమణపై కొరడా

ఆర్వోబీ ఆక్రమణపై కొరడా