సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’ | - | Sakshi
Sakshi News home page

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’

Jul 2 2025 6:45 AM | Updated on Jul 2 2025 6:45 AM

సాగుల

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’

ఆధునిక వ్యవసాయం దిశగా అడుగులు

యాప్‌, వాట్సాప్‌తో యువతరం కొంతపుంతలు

ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం.. మార్కెట్‌ ధరలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: మొన్నటివరకు పాతతరం రైతులు సాంప్రదాయ వ్యవసాయం చేస్తే.. నేటి యువతరం సాగును లాభసాటిగా మార్చుకుని.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్‌ టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో సిరులు పండిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన యాప్‌లను మోబైల్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఆధునిక సేద్యానికి సన్నద్ధం అవుతున్నారు. సాగులో వస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తమ స్నేహితులతో పంచుకుంటూ సాగుకు మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు.

విత్తనాలు వేసినప్పటి నుంచే..

బీటెక్‌, ఎంబీఏ చేసి.. కార్పొరేట్‌ కొలువులు చేస్తున్న యువత వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉండటం, అందులో వ్యవసాయ సమాచారాన్ని అందించే యాప్‌లు అందుబాటులోకి రావడం యువ రైతులకు కలిసి వస్తోంది. యాప్‌ల ద్వారా ఏ సమయంలో విత్తనం వేయాలి..? ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి..? పంట ఎప్పుడు వస్తుంది..? ఆ పంటను కూలీల అవసరం లేకుండా యంత్రాల సహాయంతో ఎలా చేయవచ్చు..? పంటకు రోగాలు వస్తే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పంట పండితే ఎక్కడ మార్కెటింగ్‌ చేసుకోవచ్చు..? అనే విషయాలపై విపులంగా వీడియో రూపంలో ఉంటుండటంతో వాటిని ఆచరిస్తూ అధిక దిగుబడి తీస్తున్నారు. ఈ యాప్‌లను జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ప్రత్యేకంగా రైతుల కోసం తయారు చేస్తున్నాయి. ఏ పంట సాగు చేస్తే.. ఆ పంట సాగు చేసే రైతులతో వాట్సాప్‌ గ్రూప్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలపై ఏ పురుగు కనబడినా వెంటనే సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి శాస్త్రవేత్తలకు పంపిస్తూ.. వాటికి అవసరమైన సస్యరక్షణ చర్యలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు.

వ్యవసాయ వర్సిటీ యూ ట్యూబ్‌ ఛానల్‌

తెలంగాణ వ్యవసాయ వర్సిటి అగ్రికల్చర్‌ వీడియోస్‌ పేరుతో తెలుగులో యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పంటల సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతుల విజయగాథలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించి మార్కెటింగ్‌ చేయడం, ఆధునిక వ్యవసాయ పనిముట్ల గురించి వివరిస్తున్నారు.

ప్లాంటిక్స్‌ యాప్‌

అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్‌ రైతుల కోసం తెలుగు భాషలో ఈ యాప్‌ను రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో తెగులు సోకిన మొక్కలను యాప్‌లో డౌన్‌లోడ్‌ చేయగానే.. కొద్ది వ్యవధిలోనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరిస్తారు.

తెలంగాణ రైతు వెబ్‌ పోర్టల్‌

తెలంగాణ రైతు పోర్టల్‌ ద్వారా రైతులు వాతావరణం, మార్కెట్‌ సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కిసాన్‌ పోర్టల్‌ ద్వారా రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు, మట్టి నమూనా పరీక్షల వివరాలు తదితర వివరాలు ఉంటాయి.

వరి నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌

ఈ పోర్టల్‌ను భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించింది. ఈ పోర్టల్‌ ద్వారా రైతులు వరి రకాలు, ఎరువుల యాజమాన్యం, కిసాన్‌ కాల్‌ సెంటర్‌కు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలను తెలుసుకోవచ్చు. అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ద్వారా వ్యవసాయంతోపాటు ఉద్యాన పంటలు, పశుపోషణ, చేపల ఉత్పత్తి పెంపకంపై సలహాలు పొందవచ్చు.

కిసాన్‌ సువిధ

దీని ద్వారా రైతులు రాబోయే ఐదు రోజులకు తమ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సూచనలు, మార్కెట్‌ ధరలు, వ్యవసాయ సూచనలను తెలుసుకోవచ్చు. అలాగే, ఈనామ్‌ పోర్టల్‌ ద్వారా రాష్ట్రం, దేశంలోని ఈనామ్‌తో అనుసంధానమైన మార్కెట్లలో పంటల ధరలను తెలుసుకోవచ్చు. తెలంగాణ అగ్రిస్‌ నెట్‌ ద్వారా పురుగుమందుల వినియోగం, పంటలు విత్తే సమయం, ఎరువుల మోతాదు వంటి సేద్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు.

యాప్‌లను ఉపయోగిస్తాను

పంటల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అగ్రికల్చర్‌ యాప్స్‌లో ఉండే సమాచారాన్ని తెలుసుకుంటాను. కొత్త విషయాలను వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా తోటి రైతులకు తెలియజేస్తాను. ఇంట్లోనే కూర్చుని సాగు సమాచారాన్ని యాప్‌ల ద్వారా తెలుసుకునే అవకాశం రావడం నేటి యువతరం అదృష్టం.

– మెక్కొండ రాంరెడ్డి, యువ రైతు, ఆలూర్‌

శాస్త్రవేత్తలు, రైతులతో వాట్సాప్‌ గ్రూప్‌

రాబోయే రోజుల్లో ఆయా పంటల శాస్త్రవేత్తలు, సాగు చేసే రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే డాట్‌ సెంటర్‌ల పరిధిలో వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. అలాగే, తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రైతుల కోసం యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు అనేక యాప్‌లు ఉన్నాయి.

– శ్రీలత, పరిశోధన స్థానం డైరెక్టర్‌, పొలాస

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’1
1/3

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’2
2/3

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’3
3/3

సాగులో ‘డిజిటల్‌ టెక్నాలజీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement