
నన్ను చంపి నా భూమి తీసుకోండి
● ఉద్రిక్తల మధ్య జాతీయ రహదారి పనులు
● అడ్డుకున్న రైతు.. పోలీసు స్టేషన్‌కు తరలింపు
మానకొండూర్: ‘నాకు న్యాయం జరిగేంతవరకు జాతీయరహదారి 563కి నా భూమిని ఇచ్చేది లేదు. అలా కాదంటే.. నన్ను చంపి నా భూమిలోంచి రోడ్డు వేయండి’ అని మండలంలోని చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ తన భూమిలో జరుగుతున్న పనులను మంగళవారం అడ్డుకున్నాడు. నేషనల్ హైవే–563 కోసం మానకొండూర్ మండలంలోని మానకొండూర్, ముంజంపల్లి, అన్నారం, ఈదులగట్టెపల్లి, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి వరకు అధికారులు భూ సేకరణ చేపట్టి, ప్రారంభించిన రహదారి విస్తరణ పనులు పూర్తి కావస్తున్నాయి. పలుచోట్లో సేకరించిన భూమికి పరిహారం తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో గుంటకు రూ.10లక్షలు ఉండగా.. అధికారులు రూ.63వేలు ఇవ్వడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. సుడా పరిధిలోని భూములకు రూ.63 చెల్లిస్తున్నారని, సుడా పరిధిలోని లేని గ్రామాలకు రూ.2లక్షలకు పైగా చెల్లించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొంత మందిరైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డు పనులకు ఇప్పటికీ భూములు ఇవ్వలేదు. చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ సైతం తన భూమిని ఇవ్వలేదు. మంగళవారం ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ విజయ్‌కుమార్, సీఐలు సంజీవ్, సదన్‌కుమార్ తమ సిబ్బందితో కుమార్ భూమి వద్దకు చేరుకున్నారు. బందోబస్తు మధ్య హైవే పనులు చేపట్టారు. తన భూమిని లాక్కోవద్దని, న్యాయం చేయాలని కుమార్ ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేపట్టుతున్నారని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. అనంతరం నేషనల్ హైవే పనులు కొనసాగించారు.