
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
చందుర్తి(వేములవాడ): ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వృద్ధుడు ఆదివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలో ని ఆశిరెడ్డిపల్లికి చెందిన నేరెళ్ల వెంకటి(72) ఈనెల 11న తన ఇంటి ముందర కూర్చోగా.. అదే మండలం నర్సింగపూర్‌కు చెందిన పూడూరి భరత్ బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రెండు కాళ్లు, చేతు విరగ్గా, తలకు బలమైన గాయమైంది. 15 రోజులపాటు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం తిరిగి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందాడు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు.
కోరుట్లలో ఒకరికి కత్తిపోట్లు
కోరుట్ల: కోరుట్లలోని రవీంద్రరోడ్‌లో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో బాధితుడిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన ఇట్యాల సత్యనారాయణ (45) పోచమ్మ బోనాల సందర్భంగా రవీంద్రరోడ్‌లోని తమ సంఘం భవనం వద్ద ఉండగా ఇల్లుటపు గంగనర్సయ్య(40) అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కత్తితో కడుపులో పొడిచినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పాత కక్షలు, గొడవలు కత్తి పోట్లకు కారణమని పేర్కొన్నారు.