
దొంగలిస్తూ.. విక్రయిస్తూ
● ఆరుగురు బైక్ దొంగల అరెస్టు
● 33 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 33 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సీపీ గౌస్‌ఆలం శుక్రవారం కమిషనరేట్ కేంద్రంలో వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వెంకిచర్లకు చెందిన పంతుల నవీన్(24), కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కరావుపల్లికి చెందిన పెంటి బాలు (24), గంగాధర మండలం లింగంపల్లికి చెందిన తోట మధు(28), రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన పెద్ది నాగరాజు(29), ఇల్లంతకుంటకు చెందిన కుంబాల సురేశ్(35), మంథని మండలం కేశనపల్లికి చెందిన సాయిప్రసాద్(24) ముఠాగా ఏర్పడ్డారు. కొన్నేళ్లుగా వివిధ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన బైక్‌ను చోరీ చేస్తున్నారు. వీరిలో ఇద్దరు బైక్ దొంగిలిస్తే.. మిగితావారు విక్రయించి, అందరూ డబ్బులు పంచుకుంటారు. కొన్నేళ్లుగా కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11బైక్‌లు, టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 9బైక్‌లు, త్రీటౌన్ స్టేషన్ పరిధిలో ఒకబైక్, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుబైక్‌లు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు బైక్‌లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు, వివరాలు లేని ఐదు బైకులు దొంగిలించారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పద్మనగర్ చౌరస్తా వద్ద టూటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. రెండు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఆరుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో రూ.12,27,000 విలువైన 33బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ సీఐ సృజన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ కోటేశ్వర్, త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డిని సీపీ అభినందించారు.