
జీపీవో నియామక ప్రక్రియ కొలిక్కి
● 25న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష ● ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలు
కరీంనగర్‌అర్బన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గ్రామ పాలన అధికారి(జీపీవో) నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇతర శాఖలకు సర్దుబా టు అయిన పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఇటీవల మరోమారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంది. సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాకు వచ్చినవా రిని తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేస్తుండడంతో హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఈ నెల 25న జీపీవో భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వానికి నివేదించారు. 175 మంది పరీక్ష రాయనున్నారు.
175 మంది ఆసక్తి
భూభారతి చట్టం అమలులో భాగంగా సర్కారు ప్రతీ రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని (జీపీవో) నియమించాలని నిర్ణయించింది. గతంలో ఆయా శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి గత డిసెంబరులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అప్పట్లో 217 మంది మాతృశాఖకు తిరిగి వచ్చేందుకు దరఖాస్తులు చేశారు. ఇందులో డిగ్రీ అర్హత కలిగినవారు, ఇంటర్, ఇంటర్‌లోపు వా రీగా విద్యార్హతను బట్టి లెక్కతేల్చారు. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్న సందర్భంలో నేరుగా నియమిస్తే కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న యోచనతో ప్రభుత్వం గత నెల 26 వరకు మరోమారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఇంటర్, డిగ్రీ వారికే అవకాశం ఇస్తూ స్క్రీనింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సర్వీసు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కేవలం 175 మంది మాత్రమే మాతృశాఖకు వచ్చేందుకు సుముఖత చూపారు. ఇందులో 119 మంది వీఆర్వోలు, 56 మంది వీఆర్‌ఏలు ఉన్నారు.
జిల్లాల వారీగా జాబితా తయారీ
ఇటీవల తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తామని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సమాచారాన్ని కలెక్టరేట్ అధికారులు జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగు చర్యలు తీసుకునేలా కసరత్తు పూర్తిచేశారు. సీసీఎల్‌ఏ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
సొంత జిల్లాలకు అవకాశం
వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో సర్దుబాటు పేరిట మిగులు సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలా భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పని చేస్తున్నారు. గతంలో జిల్లాలో విధులు నిర్వహించగా సుదూరంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నవారి జాబితాను రూపొందించారు. వారంతా ఆయా జిల్లాలకు తరలివెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంతో వారిలో ఆనందం కనిపిస్తోంది.