
వామ్మో.. ఎములాడ రోడ్డు
కొత్తపల్లి: కరీంనగర్– వేములవాడ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఏర్పడ్డ గుంతలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత 15 రోజులుగా సమస్య తీవ్రమవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి నిర్మాణంలో ఇరువైపుల చేపట్టిన డ్రైనేజీ నీటి మళ్లింపులో చోటు చేసుకున్న తప్పిదంతోనే రహదారిపై నీళ్లు నిలుస్తున్నాయని, పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
13.8 కిలోమీటర్ల రహదారి
కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ (బావుపేట) పారిశ్రామిక ప్రాంతం మీదుగా వేములవాడ, కామారెడ్డిలకు వెళ్లే రహదారిపై నిత్యం నెలకొన్న రద్దీని దృష్టిలో పద్మనగర్–ఒడ్యారం మధ్య 13.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను రూ.89 కోట్ల నిధులతో చేపట్టారు. ఈ రహదారి విస్తరణ ప్రస్తుతం నవ్వులు పాలవుతోంది. ఒక సారి రోడ్డు..మరోసారి వంతెనలు.. నిర్మించిన ఈ రహదారిపై మరో సమస్య ఏర్పడింది. గతంలో సైతం రోడ్డుపై నిలుస్తున్న నీటిని మళ్లించడంలో అవస్థలు ఎదురయ్యాయి. ప్రస్తుతం డ్రైనేజీ నీటితో రహదారి పూర్తి చెడిపోతోంది.
డ్రైనేజీ నీటి మళ్లింపు లేక
పద్మనగర్– ఒడ్యారం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొత్తపల్లి మండలం బావుపేటలో రోడ్డు కిరువైపుల చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థల వల్ల తరచూ సమస్య తలెత్తుతోంది. వర్షం పడినప్పుడు వరద నీరు ఎటూ వెళ్లాలేక నిలిచిన రోజులున్నాయి. ఇప్పుడైతే బావుపేటలోని ఎన్టీఆర్ తమిళకాలనీ నుంచి వస్తున్న మురికి నీరు రోడ్డుకిరువైపుల ఉన్న డ్రైనేజీలోకి చేరుతోంది. ఆ నీటి మళ్లింపు లేక రోడ్డుపై నిలుస్తోంది. ఫలితంగా రోడ్డంతా డ్రైనేజీ నీటితో నిండిపోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులకు తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రానైట్ లోడ్ వాహనాలు ఈ రహదారిపై వెళ్తుండడం, యూ టర్న్ చేసుకొనే వాహనాలు బ్రేక్‌లు వేస్తుండటంతో రోడ్డు పూర్తిగా చెడిపోతోంది. ఫలితంగా ద్విచక్రవాహనదారులు కిందపడుతుండగా, కార్లు గుంతల్లో చిక్కుకుంటున్నాయి.
ప్రమాదకరంగా ప్రధాన రహదారి
బావుపేట వద్ద రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీరు
గుంతల్లో ఇరుక్కుంటున్న వాహనాలు
ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని అధికారులు
గుంతలతో ప్రమాదాలు
బావుపేట వద్ద డ్రైనేజీ నీటి మళ్లింపు లేక రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. పారిశ్రామిక ప్రాంతం బావుపేట నుంచి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి తదితర ప్రాంతాలతో పాటు అటు వైపు నుంచి బావుపేటకు వచ్చే వాహనాలతో రోడ్డు బిజీగా మారింది. దీంతో వాహనాల తాకిడి అధికంగా ఉండటంతో రోడ్డుపై గుంతలు ఎక్కువై ప్రమాదాలు జరుగుతున్నాయి.
డ్రైనేజీ నీటిని మళ్లించాలి
పద్మనగర్– ఒడ్యారం రహదారి నిర్మాణ పనులు లోపభూయిష్టంగా చేపట్టడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. బావుపేట వద్ద మురికి నీటి మళ్లింపు చేపట్టకపోవడంతో రహదారిపై నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. మోకాలు లోతు గుంతలు ఏర్పడటంతో వాహనాలు చిక్కుకుంటున్నాయి. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలతో రహదారి మరింత చెడిపోతోంది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ఈ రహదారి మరమ్మతు చేపట్టాలి. – కుంట తిరుపతి,
బీజేపీ మండల అధ్యక్షుడు, కొత్తపల్లి

వామ్మో.. ఎములాడ రోడ్డు