
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హుజూరాబాద్: అప్పుల బాధతో ఓ రైతు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాయికల్‌కు చెందిన రావుల తిరుపతిరెడ్డి(38)కి రెండెకరాల భూమి ఉంది. కొద్దిరోజుల క్రితం హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. పంట దిగుబడి సరిగా రాక.. హార్వెస్టర్‌కు కిస్తీలు చెల్లించలేకపోయాడు. మరోవైపు అప్పు రూ.10లక్షలకు చేరుకుంది. అప్పు ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకున్నాడు. భార్య కవిత పిల్లలతోపాటు ఇంటి ఆవరణలో పడుకుంది. ఉదయం తిరుపతిరెడ్డి బయటకు రాకపోవడంతో కవిత ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు.