
ఇద్దరిని బలిగొన్న అతివేగం
● బైక్‌పై వస్తుండగా ఢీకొన్న కారు ● రెండేళ్ల చిన్నారి, ఆమె పెద్దనాన్న దుర్మరణం ● చిన్నారి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడ సమీపంలోని పూరెల్లవాడలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో రెండేళ్ల చిన్నారి.. ఆమె పెద్దనాన్న అక్కడికక్కడే మృతిచెందారు. పూరెల్లవాడకు చెందిన పాదం మల్లేశం (35), ప్రవళిక దంపతులకు సంతానం లేదు. అతని సోదరుడు పాదం శేఖర్, నవ్య దంపతుల కూతురు వితన్వి (2)ని కన్న కూతురులా చూసుకుంటున్నారు. ఆమెను ఎక్కువగా తమ ఇంటివద్దనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లేశం వితన్విని పొలానికి తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఇంటికి సమీపంలోకి రాగానే కండ్లపల్లి వైపు నుంచి జగిత్యాలకు వస్తున్న కారు అతివేగంగా వచ్చి మల్లేశం, వితన్విని ఢీకొంది. ఈ ఘటనలో మల్లేశ్, వితన్వి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రెండు కుటుంబాల్లో విషాదం
మల్లేశం, వితన్వి మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అటు మల్లేశ్ భార్య ప్రవళిక, వితన్వి తల్లిదండ్రలు శేఖర్, నవ్య తీవ్రంగా రోదిస్తున్నారు. చిన్నారితో నిత్యం ఆటపాటలతో సంతోషంగా ఉండే శేఖర్, నవ్య తమ కూతురు లేదని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇద్దరిని బలిగొన్న అతివేగం