
దుబాయ్‌లో అల్లీపూర్ వాసి మృతి
రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (55) దుబాయ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడి ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
వడదెబ్బతో గొర్లకాపరి..
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా బోజన్నపేట గ్రామానికి చెందిన గొర్లకాపరి కుడుదుల సమ్మయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. రోజువారీగా కుడుదుల సమ్మయ్య గొర్లను తీసుకెళ్లి మేపుతుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. సమ్మయ్యను చికిత్సకోసం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
గాయపడిన వ్యక్తి..
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్‌లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన చెట్‌పల్లి అజయ్ (19) చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి అంత్యక్రియలు జగిత్యాలలో శనివారం సాయంత్రం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రైలు ఢీకొని ఒకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చ ల్‌గల్ గ్రామానికి చెందిన లగిశెట్టి తిరుపతి (40) శనివారం ఉదయం రైలు ఢీకొని మృతి చెందాడు. తిరుపతి కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకుండా బయట తిరుగుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మోరపల్లి, చల్‌గల్ శివారులోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రైలు ఢీకొని మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో..
చొప్పదండి: ఆర్నకొండ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చీకట్ల శంకరయ్య మృతి చెందాడు. ఎస్సై మామిడాల సురెందర్ కథనం ప్రకారం... ఆర్నకొండ శివారులోని మామిడితోటకు శంకరయ్య నీళ్లు పెట్టి ఖమ్మర్‌ఖాన్ పేట ఎక్స్ రోడ్డు వద్ద గల హోటల్ టీ తాగడానికి వచ్చాడు. టీతాగి తిరిగి వెళ్తుండగా ధర్మారం నుంచి కరీంనగర్ వస్తున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా నిర్లక్ష్యంగా నడిపి శంకరయ్యను ఢీకొట్టాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఉపాధి హామీ కూలీ..
రాయికల్: రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ ఏగోలపు రాములు (50) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈనెల 8న ఉపాధి హామీ పనికి వెళ్లగా.. అక్కడ గుండెనొప్పి రావడంతో గమనించిన తోటి కూలీలు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.