
విజయోస్తు.. చికిత
● నేడు షాంఘైలో జరిగే ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 ఫైనల్ పోరులో పాల్గొంటున్న చికిత ● స్వర్ణంతో తిరిగి రావాలంటున్న పలువురు
కరీంనగర్‌స్పోర్ట్స్: మారుమూల గ్రామం నుంచి ఎదిగి నేడు భారత జాతీయ పతాకాన్ని పొరుగు దేశం చైనాలో రెపరెపలాడించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలువడం విశేషం. చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువ పెంచుకున్న తను అర్చరీ క్రీడలో రాణించి నేడు భారత బృందంలో మేటి క్రీడాకారిణిగా ఎదిగింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత. ప్రస్తుతం చైనా దేశంలోని షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 పోటీల్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు అద్వితీయ ప్రతిభతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత జట్టులోని ముగ్గురిలో తానిపర్తి చికిత ఒకరు. శనివారం మెక్సికోతో జరిగే ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చాంపియన్‌గా నిలిచి స్వర్ణంతో తిరిగిరావాలని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
చికిత సాధించిన పతకాలు
● హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో శిక్షణ పొందుతున్న చికిత ఇదివరకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తెలంగాణకు, భారత దేశానికి పతకాలు సాధించిపెట్టింది.
● తాజాగా ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది.
● మార్చిలో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సైతం కాంస్య పతకం సాధించింది.
● ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో కూడా పతకం ఖాయం చేసుకుంది.
కూతురుపై నమ్మకం ఉంది
నా కూతురుపై నమ్మకం ఉంది. తప్పకుండా స్వర్ణ పతకం సాధిస్తుంది. దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుంది.
– తానిపర్తి శ్రీనివాస్ రావు, చికిత తండ్రి
జాతీయ పతాకం ఎగరేయాలి
స్వర్ణ పతకం సాధించాలి. పొరుగు దేశం చైనాలో భారత జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేయాలి.
– చింతకుంట విజయరమణారావు,
ఎమ్మెల్యే, పెద్దపల్లి
చాంపియన్‌గా నిలవాలి
ఫైనల్‌లో మెక్సికోపై విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలి. చాంపియన్ గా నిలవాలి.
– సురేశ్, డీవైఎస్‌ఓ, పెద్దపల్లి
ప్రపంచపటంలో నిలపాలి
అర్చరీలో స్వర్ణ పతకం సాధించాలి. పెద్దపల్లి జిల్లాను ప్రపంచ పటంలో నిలపాలి.
– ముస్త్యాల రవీందర్,
సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు
స్ఫూర్తిగా నిలవాలి
ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 లో విజేతగా నిలిచి అందరికీ స్పూర్తిగా నిలవాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలి.
– నందెల్లి మహిపాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
గర్వంగా ఉంది
మారుమూల గ్రామం నుంచి ఎదిగి నేడు భారత జట్టులో కీలక క్రీడాకారిణి కావడం గర్వంగా ఉంది. విజేతగా తిరిగి రావాలి.
– గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి
మరిన్ని పతకాలు సాధించాలి
అర్చరీలో ఎవరికీ అందనంత ఎదిగి నేడు దేశానికి పతకం సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలి.
– కొమురోజు శ్రీనివాస్,
ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి