
సీడ్ డబ్బులు ఇవ్వలేదని రైతుల ఆందోళన
● వాహనాలు నిలిపివేసి నిరసన.. రోడ్డుపై వంటావార్పు
ఓదెల: సీడ్ కంపెనీ ధాన్యం డబ్పులు చెల్లించడంలేదని ఆరోపిస్తూ పలువురు రైతులు కనగర్తిలో గురువారం లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. సీడ్ ఏజెంట్ బండ రాజు, రెతుల కథనం ప్రకారం.. గత వానాకాలం సీజన్‌లో కనగర్తి గ్రామంలో ఓ సీడ్ కంపెనీకి చెందిన ధాన్యం విత్తనాలను 23 మంది రైతులు దాదాపు 60 ఎకరాల్లో సాగుచేశారు. పంట చేతికొచ్చాక ధాన్యం లోడ్‌చేసుకొని వెళ్లిన కంపెనీ.. తమకు రావాల్సిన రూ. 22లక్షల్లో రూ.14 లక్షలే చెల్లించింది. మిగతా డబ్బుల కోసం సీడ్ కంపెనీ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయింది. ఈ వానాకాలం మళ్లీ అదే సీడ్ కంపెనీకి చెందిన ముగ్గురు రైతులు సాగు చేసి ధాన్యాన్ని లారీ, డీసీఎం వ్యాన్‌లో గురువారం తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ రోడ్డుపైనే బైఠాయించారు. వంటావార్పుతో నిరసన తెలిపారు. తమకు రావాల్సిన రూ.14లక్షలు చెల్లించి, సీడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నెదురు రమేశ్, భద్రయ్య, శ్రీరామోజు భద్రయ్య, తాటిపల్లి వీరయ్య, పరుపాటి చంద్రారెడ్డి, కొప్పుల సమ్మయ్య, మల్లారెడ్డితోపాటు 25మంది రైతులు పాల్గొన్నారు.