
కనుల పండువగా రథయాత్ర
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీజగన్నాథ రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. విద్యానగర్ సాయిబాబా ఆలయం చౌరస్తా వద్ద రథయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సిరిసిల్ల రోడ్డులోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం వరకు రథయాత్ర సాగింది. వడోదర ఇస్కాన్ ప్రతినిధులు వాసుగోష్ ప్రభు, వెంకటదాసు ప్రభు, పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, వీహెచ్‌పీ ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరేకృష్ణ, జై జగన్నాథ నామస్మరణతో పుర వీధులు మారుమోగాయి. నవీపేటకు చెందిన చందు సాయన్న చిందు కళాకారుల బృందం దేవతామూర్తుల వేషధారణతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.