
‘ఇందిరమ్మ’కు ధరాఘాతం
● జిల్లాకు 11,489 ఇళ్లు మంజూరు
● 5,246 ఇళ్లకు మార్కింగ్ పూర్తి
● స్లాబ్ లెవల్‌కు చేరింది 17 ఇళ్లే..
● రూఫ్ లెవల్‌కు 69..
● బేస్‌మెంట్ లెవల్‌లో
మరో 449 నిర్మాణాలు..
● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరలతో ముందుకు రాని లబ్ధిదారులు
సదాశివనగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ధరాఘాతం తగిలింది. పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరల కారణంగా ఇళ్ల నిర్మాణానికి చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో నిర్మాణాలు వేగం పుంజుకోవడం లేదు.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో జిల్లాకు 11,489 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,246 గృహాలకు మార్కింగ్ పూర్తయ్యింది. ఇప్పటివరకు 17 ఇళ్లు మాత్రమే స్లాబ్ లెవల్‌కు చేరాయి. 69 గృహాలు రూఫ్ లెవల్‌లో ఉండగా 449 నిర్మాణాలు బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. మిగతావాటి పనులు ముందుకు సాగడం లేదు.
అప్పుల పాలవుతున్న నిర్మాణదారులు
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వివిధ దశలలో బిల్లులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు ఇస్తుంది. రూఫ్ లెవల్ వరకు పూర్తయితే రూ. 1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ. 1.75 లక్షలు, రంగులు వేసిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు అందిస్తుంది. అయితే పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నిర్మాణదారులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు తేవాల్సి వస్తోంది. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. దీంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ధరలు ౖపైపెకి...
ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో సిమెంట్ బస్తా ధర రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 330 నుంచి రూ. 360కి విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 2 వేలనుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటుక, స్టీల్, కలప ధరలూ గణనీయంగా పెరిగాయి.
విపరీతంగా ధరలు పెరిగాయి
ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని మురిసినం. ఇంటి నిర్మాణం చేపట్టినం. సి మెంట్, ఇసుక, సలాక ధర లు మస్తు పెరిగినయి. ఒక సలాక కోసమే రూ. లక్ష అ యినయి. సిమెంట్ కూడా మస్తు పెరిగింది. ఇబ్బందిగా ఉంది.
– సాకలి సాయిలు, లబ్ధిదారు, ధర్మారావ్‌పేట్
ప్రోత్సహిస్తున్నాం..
మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులను గుర్తించాం. కొన్నిచోట్ల పనులు ప్రారంభించాం. ఇప్పటికీ ఇంకా మార్కింగ్ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇల్లు మంజూరైనవారు నిర్మాణాలు చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నాం. పనులు ప్రారంభించిన వారికి నిబంధనల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తున్నాం.
– విజయపాల్‌రెడ్డి, హౌసింగ్ పీడీ, కామారెడ్డి

‘ఇందిరమ్మ’కు ధరాఘాతం