
ఔషధ గుణాల తాటిముంజ
బాన్సువాడ రూరల్: ఔషధ గుణాలు కలిగి ఉన్న తాటిముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని ఐస్‌ఆపిల్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. తాటిముంజాలు వేసవిలోనే లభిస్తుంటాయి. పట్టణ పరిసరాల్లో ఆశించిన స్థాయిలో తాటివనాలు లేనప్పటికీ నిజాంసాగర్, పిట్లం, మహ్మద్‌నగర్ తదితర గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తాటిముంజలను పట్టణాలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, సోమేశ్వర్ , బుడిమి చౌరస్తాలో రహదారులకు ఇరువైపులా డజన్ రూ.60నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తాటి కల్లు తరహాలోనే ముంజలకు సైతం ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులతోపాటు వైద్యులు సైతం పేర్కొంటున్నారు. మానవ శరీరంలోని టాక్సినస్‌ను వదిలించుకోవడానికి, శరీర సహజ ఉష్ణోగ్రత నిర్వహణకు తాటి ముంజలు సహాయ పడతాయంటున్నారు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి అవి త్వరలోనే మానిపోతాయి. ముంజలను గుజ్జుగా చేసి, ముఖానికి పైపూతగా రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి, వేసవిలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తాటి ముంజలతో శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు.
పోషక భాండాగారం
తాటిముంజాలు శరీరంలోని చక్కర, ఖనిజ లవణాలను సమతుల్యం చేస్తాయి. విటమిన్ బి–7, విటమిన్ కే, పోటాషియం, ఐరన్, జింక్, కాల్షియంతోపాటు సెలబుల్ ఫైబర్, విటమిన్ ఏ, బీ, డీ, కే ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. డీ–హైడ్రేషన్ బారిన పడకుండా తాటిముంజలు దోహదం చేస్తాయి.
ఆరోగ్యానికి మేలు
తాటిముంజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఇష్టంగా తినవచ్చు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు జీర్ణకోశ సమస్యలు ఉన్న వారికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పోటాషియం ఎక్కువగా లభిస్తుంది. పొట్టుతో తీసుకుంటే మలబద్ధ్దకం తగ్గుతుంది.
– శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్

ఔషధ గుణాల తాటిముంజ

ఔషధ గుణాల తాటిముంజ