
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
ఒక్కరోజు ఆదాయం రూ.60.42 లక్షలు
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఏడు శనివారాల వ్రతంతో పాటు సాధారణ దర్శనాలకు వచ్చిన భక్తుల హరినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ.60,41,722 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ధర్మపథంలో భాగంగా నృత్య కళాకారుల బృందం వేంకటేశ్వర వైభవం, తదితర కూచిపూడి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు.