
యాంత్రీకరణ దిశగా రైతు అడుగులు
కాకినాడ సిటీ: వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, వివిధ యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. 688 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి మంజూరైన రాయితీ రూ.3.83 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. అనంతరం రైతులకు వివిధ రకాల విత్తనాలకు సంబంధించిన మినీ కిట్లను, పవర్ స్ప్రేలను పంపిణీ చేశారు. జిల్లాకు 42 డ్రోన్లు లక్ష్యం కాగా ఇప్పటికి 35 మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయగా, 25 మంది బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే నలుగురికి కిసాన్ డ్రోన్లు అందజేసినట్లు వివరించారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన వారందరికీ రాయితీపై డ్రోన్లు అందజేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయమే లేదన్నారు. యు కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన ఏ సాయిచంద్రారెడ్డి, పెద్దాపురం మండలం గోరింకకు చెందిన సాయికృష్ణ, గొల్లప్రోలు మండలం వెన్నపూడికి చందిన జి కొండయ్య, తాళ్లరేవు మండలం పి మల్లవరానికి చెందిన పి పాండురంగారావు, వ్యవసాయ రంగంలో డ్రోన్లు, పవర్ టిల్లర్ల వినియోగంతో కలిగే లాభాలను వివరించారు.
మాదక ద్రవ్యాల నిరోధానికి
ప్రజా సహకారం అవసరం
రాజానగరం: మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి ప్రజా సహకారం కూడా ఉండాలని రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈగల్) ఆర్‌కే రవికృష్ణ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలోను విద్యార్థులతో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఇందులో సభ్యునిగా ఉంటూ తన దృష్టికి వచ్చిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసుల్లో నేరస్తులుగా ఎవరు పట్టుబడినా వారి భవిష్యత్తు నాశనం కాక తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్ క్లబ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)తో కలిసి విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్‌బీ మురళీకృష్ణ, నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐలు వీరయ్యగౌడ్, సూర్యమోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర, జీజీయూ వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీవీఎస్ శర్మ, పాల్గొన్నారు.
లేపాక్షి, ఆప్కో సావనీర్ డిజైన్ పోటీలకు ఆహ్వానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): లేపాక్షి హస్తకళలు, ఆప్కో హ్యాండ్లూమ్స్ సావనీర్ డిజైన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల ఎండీ విశ్వమనోహరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సైతం పోటీల్లో భాగస్వామ్యంగా ఉంటుందన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, వుడ్ కార్వింగ్, పప్పెట్, బొబ్బిలి బొమ్మలు, కలంకారి ప్రింట్లు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, బందరు వస్త్రాలతో నూతనత్వం ఉట్టిపడేలా కొత్త డిజైన్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల వరకు నగదు బహుమతులు ఉంటాయన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చేతివృత్తులవారు, కళాఖండాలు గీసేవారు, చేతితో బొమ్మలు తయారు చేసేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. నమూనాలను జూలై 16వ తేదీలోగా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద గల లేపాక్షి ఎంపోరియంలో అందించాలని లేపాక్షి నగర శాఖ మేనేజర్ మోనిక తెలిపారు.
23న ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే ఈ రన్‌లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.