
క్లోజర్ పనులకు మంగళం?
ఫ పూడుకుపోయిన తూములు, కాలువలు
ఫ పిఠాపురంలో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం
ఫ సార్వా సీజన్ దగ్గర పడుతున్నా చేపట్టని వైనం
పిఠాపురం: రబీ సీజన్ ముగిసింది.. పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేసి మూడు వారాలు అయింది. 20 రోజుల్లో మళ్లీ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధమవుతోంది. కాని ఈ మధ్యలో చేపట్టాల్సిన పంట కాలువల అభివృద్ధి (క్లోజర్) పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు, పీబీసీ కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పుణ్యకాలం పూర్తవుతున్నా ఎక్కడా కాలువల్లో పూడికతీత తీస్తున్న దాఖలాలు లేక ఇంకెప్పుడు చేస్తారో పనులు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సార్వాలో ఏలేరు వరదలు నియోజకవర్గంలో పంటలను నట్టేట ముంచేయగా రబీలో అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఒకపక్క కాలువలు, తూములు, స్లూయిజ్‌లన్నీ మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడా సాగునీరు సక్రమంగా పారే పరిస్థితి లేదు. పంట విరామ సమయంలో అన్నీ పూర్తి చేస్తారని ఆశగా ఎదురు చూశామని, కానీ ఎక్కడా పనులు చేయకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పవని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు.