ఫ రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా
ఆహ్వానం
ఫ 24 తుది గడువు
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ నిర్మాణాలకు అధికారులు ముచ్చటగా మూడోసారి టెండర్లు పిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి టెండర్లు పిలిచి, జనవరిలో రద్దు చేశారు. అనంతరం, రూ.18.98 కోట్ల అంచనాతో గత జనవరిలో రెండోసారి టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన అనంత రాములు అండ్ కో 16 శాతం లెస్‌కు కొటేషన్ దాఖలు చేసి, ఈ టెండర్ దక్కించుకుంది. కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈలోగా గత నెల 30న సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. దీంతో, ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ అనంత రాములు అండ్ కోను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ కాంట్రాక్టర్ కూడా ఆ కంపెనీయే కావడంతో ఇక్కడ కూడా ఆ సంస్ధ కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రూ.18.98 కోట్ల అంచనాతో ప్రసాద్ నిర్మాణాలకు ఈ నెల 15వ తేదీన ముచ్చటగా మూడోసారి షార్టు టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 24 ఆఖరు తేదీ. అనంతరం, వాటిని తెరచి, ఖరారు చేస్తారని టూరిజం శాఖ ఈఈ ఈశ్వరయ్య శ్రీసాక్షిశ్రీకి ఆదివారం తెలిపారు.