
మన్నించండి మహారాజా..
పిఠాపురం: వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలు కరవు బారిన పడకూడదని.. పంటలు పుష్కలంగా పండాలనే సమున్నత లక్ష్యంతో పిఠాపురం మహారాజా సమకూర్చిన అపార జలనిధిపై జలవనరుల శాఖ అధికారులు అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. వేల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగునీరు అందించేందుకు ఆ మహనీయుడు నిర్మించిన భారీ చెరువు నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం తూములు కూడా బాగు చేయించకపోవడంతో వందల క్యూసెక్కుల నీరు కడలి పాలవుతోంది. మరోవైపు చెరువు ఆక్రమణల పాలవుతున్నా కబ్జాదారులకు అండగా నిలుస్తూ రైతులు, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ వంశం దాతృత్వానికి ఈ చెరువు మచ్చుతునక. దీనిని నిర్మించిన పిఠాపురం మహారాజా విగ్రహాన్ని ప్రజలు ఆ చెరువు గట్టుపై ఏర్పాటు చేసుకుంటే.. దాని నిర్వహణనూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్లతుప్పలు పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
15 వేల ఎకరాల ఆయకట్టు
పూర్వం తరచూ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక, పంటలు పండక రైతులు.. తాగునీరు లేక ప్రజలు, పశువులు అల్లాడిపోవడం చూసి మహారాజా కలత చెందారు. భవిష్యత్తులో ఎంత కరవు వచ్చినా తన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించారు. ఈ నేపథ్యంలో రాజా రావు బహద్దూరు (ఆర్‌ఆర్‌బీ) పేరిట 1841లో గొల్లప్రోలు మండలం చేబ్రోలు – మల్లవరం మధ్య 1,416 ఎకరాల విస్తీర్ణంలో పిఠాపురం మహారాజా అతి పెద్దదైన ఈ చెరువును నిర్మించారు. పదేళ్ల పాటు వానలు కురవక పోయినా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు, 2 లక్షల మందికి తాగునీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా పిఠాపురం మహారాజా చర్యలు తీసుకున్నారు. కొత్తపల్లి, గొల్లప్రోలు, తొండంగి మండలాల్లోని నాగులాపల్లి, రమణక్కపేట, ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం, శ్రీరాంపురం, రావివారిపోడు, ముమ్మిడివారిపోడు, ఏవీ నగరం, కోదాడ, రావికంపాడు, ఎ.విజయనగరం, దుర్గాడ, తొండంగి తదితర 30 గ్రామాల్లోని దాదాపు లక్ష కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. పిఠాపురం బ్రాంచి కెనాల్, సుద్దగెడ్డ కాలువల నుంచి ఈ చెరువులోకి నీరు ప్రవహిస్తూంటుంది. ఈ చెరువు కింద ప్రస్తుతం సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 50 వేల మంది రైతులు సాగు చేసుకుంటున్నారు.
మహారాజా సాక్షిగా మట్టి పాలవుతున్న జలనిధి
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతూండటంతో ఇది కాస్తా మట్టిదిబ్బగా మారుతోంది. ఈ చెరువుకు 14 తూములు, ఒక కళింగలు ఉన్నాయి. చెరువు నిండా నీరు పెడితే పదేళ్ల పాటు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. అయితే తూములు, కళింగలు పూర్తి అధ్వాన స్థితికి చేరుకోవడంతో వర్షాలు కురిసినప్పుడు అదనపు నీరు వచ్చినా.. నిల్వ చేసే అవకాశం ఉండటం లేదు. ఈ తూముల షట్టర్లు పూర్తిగా శిథిలమై, మట్టితో పూడుకుపోవడంతో ఎప్పటి నీరు అప్పుడే సముద్రంలోకి పోతోందని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా సుమారు 2 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని అంచనా. మరోవైపు తూములు పూడుకుపోయి సాగు నీరు అందక పంటలు నష్టపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నట్లు చెప్పుకునే ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు వంక కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
ప్రాచీన చరిత్ర, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ చెరువు అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, వరదలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆయకట్టులోని వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో నీటిని నిల్వ చేసే వీలు ఉండటం లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ చెరువును అభివృద్ధి చేయాలని, కళింగలు, తూములకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
తాత్కాలిక మరమ్మతులు
ఆర్‌ఆర్‌బీ చెరువు తాత్కాలిక మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. తాత్కాలిక మరమ్మతులకు మాత్రమే నిధులు విడుదలవుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఇంకా ఎటువంటి నిధులూ విడుదల కాలేదు.
– సంతోష్ కుమార్, డీఈ, జలవనరుల శాఖ
ఫ 1,400 ఎకరాల చెరువును
పట్టించుకోని జలవనరుల శాఖ
ఫ మహారాజా సాక్షిగా వందల
క్యూసెక్కులు కడలి పాలు
ఫ వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం

మన్నించండి మహారాజా..

మన్నించండి మహారాజా..

మన్నించండి మహారాజా..