
ప్చ్.. కళ కట్టలే..
అన్నవరం: గతంతో పోలిస్తే ఈ ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాలు పెద్దగా కళ కట్టలేదనే విమర్శ భక్తుల నుంచి వస్తోంది. అలంకరణల నుంచి సంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని క్రతువులు నిర్వహించడం వరకూ ఇప్పటికీ చర్చ నడుస్తోంది.
పూర్తి స్థాయిలో కానరాని అలంకరణ
ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దివ్యకల్యాణం 8వ తేదీ రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ వేదిక అలంకరణ బాగుంది. కానీ, వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డు పై భాగంలో ఎటువంటి అలంకరణా చేయలేదు. ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా ఈ షెడ్డు పై భాగాన్ని అందమైన వస్త్రంతో కవర్ చేసి, దానికి పూలమాలలు, విద్యుద్దీపాలతో అలంకరించేవారు. ఈసారి అటువంటిదేమీ లేకపోవడంతో షెడ్ వెలవెలబోయినట్లు కనిపించింది.
ఫ కల్యాణోత్సవానికి వచ్చిన వీఐపీలకు స్వామివారి ప్రసాదాలు, కల్యాణ అక్షతలతో పాటు నూతన వస్త్రాలు బహూకరించడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలకు వీటిని అందజేశారు. కానీ, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌కు కనీసం అక్షతలు కూడా ఇవ్వకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై ఆయన కల్యాణ వేదిక వద్దనే ఈఓ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు.
హోమాల నిలిపివేత
రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ప్రతి శుక్రవారం చండీహోమం, అమావాస్య, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. సత్యదేవుని కల్యాణోత్సవాల్లో కూడా ఈ హోమాలు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి మాత్రం ఈ హోమాలు నిలిపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై అన్నివైపుల నుంచీ విమర్శలు రావడంతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు వైదిక కమిటీ సభ్యులతో గత మంగళవారం సమావేశమయ్యారు. హోమాలు ఎందుకు నిలిపివేశారో వివరణ ఇవ్వాలని నిలదీశారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి వైదిక కార్యక్రమాల నిర్వహణపై శృంగేరి పీఠాధిపతి సూచనలు పాటించాలని నిర్ణయించారు. హోమాల నిలిపివేతపై ‘సాక్షి’ ఈ నెల 8వ తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై మొదట్లోనే స్పందించి, హోమాలు నిర్వహించాలని ఆదేశించి ఉంటే అసలు ఈ వివాదమే తలెత్తేది కాదు.
రథోత్సవం వెలవెల
ఫ అసలే మే నెల ఎండ.. దానికి తోడు అగ్నికత్తెరలు.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. సాయంత్రం ఆరు గంటలకు కూడా బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. వాతావరణం వేడిగా ఉండటంతో ఈ ఉత్సవం ప్రారంభంలో పట్టుమని వంద మంది భక్తులు లేరు. చివరిలో అంటే రాత్రి 7.30 గంటల సమయానికి రెండు మూడు వేల మంది మాత్రం వచ్చారు.
ఫ సాధారణంగా రథోత్సవం సందర్భంగా రథానికి కట్టిన పగ్గాలను భక్తులు లాగుతారు. కానీ, భద్రత పేరుతో సత్యదేవుని రథం పగ్గాలను భక్తులను పట్టుకోనివ్వలేదు. ముందు ట్రాక్టర్ ఉంచి, దానికి కట్టి లాగించారు. రథానికి వెనుక సపోర్టుగా జేసీబీకి పగ్గాలు కట్టారు. దీంతో, ఇదేం రథోత్సవమని విస్తుపోవడం భక్తుల వంతైంది.
ఫ ఉత్సవాల్లో ఎప్పుడు ఊరేగింపులు నిర్వహించినా భక్తులకు ప్రసాదాలుగా పులిహోర, శనగలు పంిపిణీ చేసేవారు. ఈసారి అటువంటిదేమీ లేదు.
సంప్రదాయానికి విరుద్ధంగా..
ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన శ్రీపుష్పయాగం నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. ఏటా స్వామివారు పడుకుని ఉండగా, అమ్మవారు ఎడమవైపు ఉండి కాళ్లు ఒత్తుతున్నట్టు పవళింపు సేవలో అలంకరణ చేసేవారు. ఈసారి స్వామివారు అమ్మవారి తొడ మీద పడుకుంటే అమ్మవారు విసన కర్రతో విసురుతున్నట్టు అలంకరించారు. ఈ క్రమంలో సంప్రదాయానికి విరుద్ధంగా స్వామివారికి అమ్మవారు కుడివైపు వచ్చారు. ఇది ఎబ్బెట్టుగా ఉందని పలువురు విమర్శించారు. అమ్మవారి చేతిలో అందమైన రంగురంగుల విసనకర్ర లేదా నెమలి ఈకల విసనకర్రనో ఉంచితే బాగుండేదని, చిన్న తాటాకుల విసనకర్రతో సరిపెట్టేశారని పలువురు పెదవి విరిచారు. ఈసారి శ్రీపుష్పయాగంలో పుష్పాలు కూడా తక్కువగానే ఉపయోగించారు. ఏటా పెద్ద వయస్సున్న వేదపండితుల దంపతులు, ఆ తరువాత అదే వయస్సు కలిగిన ప్రధానార్చకుల ఐదు జంటలకు దంపత తాంబూలాలు ఇచ్చేవారు. కానీ, ఈసారి పెద్దలను పక్కన పెట్టి, చిన్న వయసులో ఉన్న దంపతులకు ఈ తాంబూలం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. దంపత తాంబూలంలో ఇచ్చిన కొబ్బరి బొండాలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమైంది.
ఫ కల్యాణం నాడు
అంతంత మాత్రంగా అలంకరణ
ఫ వనదుర్గ అమ్మవారికి
హోమాల నిలిపివేతపై వివాదం
ఫ రథోత్సవానికి ఎండదెబ్బ
ఫ శ్రీపుష్పయాగంలో సంప్రదాయానికి
భిన్నంగా స్వామికి కుడివైపు అమ్మవారు
ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలపై
భక్తుల పెదవి విరుపు