
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ పై అంతస్తులో అగ్నిప్రమాదం.. వెంటనే విపత్తు స్పందన సిబ్బంది నిచ్చెన సహాయంతో భవనం లోపలకు చేరుకుని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకువచ్చారు.. బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించేందుకు అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.. ఇదంతా నిజమనుకునేరు.. అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కొనేలా ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖల సిబ్బంది కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందులో అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే విధానాన్ని ఆ శాఖ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపారు. అలాగే, ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను కాపాడటం, సహాయక చర్యలు తదితర అంశాలను ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వివరించారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో కొంత భాగం కూలిపోయినట్లు ఊహించి.. అందులోని వారిని కాపాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కూలిన భవనంలో చిక్కుకున్నవారిని గుర్తించేందుకు అధునాతన పరికరాల వినియోగాన్ని వివరించారు. గోడను కట్టర్లతో కట్ చేసి, భవనంలోకి ప్రవేశించి, లోపలున్న వారిని బయటకు తరలించడం తదితర అంశాలను చూపించారు. సీపీఆర్, అత్యవసర వైద్యంపై ఆ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్‌ను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా పర్యవేక్షించారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని ఆయనన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జె.వెంకటరావు, మూడో బెటాలియన్ ఎస్‌డీర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం.మోహన్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, డీఈఓసీ నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్‌డీసీ డి.భారతి తదితరులు పాల్గొన్నారు.