
‘టిప్‌లైన్’తో పట్టేస్తున్నారు
● చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటు పడిన ప్రబుద్ధుల బండారం పోలీసులు ‘టిప్ లైన్’ యాప్ సాంకేతికతతో బయటపడింది.
● మొబైల్ లేదా గాడ్జెట్‌లో వీక్షించి, షేర్ చేసినా, మొబైల్‌లో అప్‌లోడ్ చేసినా ఆ విషయం నేరుగా కేంద్ర హోం శాఖకు చేరుతుంది.
● టిప్‌లైన్ ద్వారా ఆ వీడియోలో ఎనిమిది రకాల వివరాలు సేకరిస్తున్నారు.
● వీడియో పంపిన, అప్‌లోడ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరంతో పాటు ఇంటర్నెట్ ప్రొటోకాల్ వివరం, వీడియో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో పంపించారు, వీడియో నిడివి, పంపిన వీడియో ఎవరికి లేదా ఏ గ్రూప్‌కి చేరింది, వీడియో పంపిన వ్యక్తి చిరునామా సహా పూర్తి వివరాలను వెలుగులోకి తేవడంలో టిప్‌లైన్ సాంకేతికత ఉపయోగపడింది.
● నిందితుల ప్రాథమిక సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పోలీసు హెడ్ క్వార్టర్స్, అక్కడి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగానికి వచ్చింది.
● ఆ వివరాలను దిశ పోలీస్ విభాగం పరిశీలించి, వల పన్ని కేసులు నమోదు చేసింది. దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో సీఐ రాజశేఖర్ ఆధ్వర్యాన ఈ చైల్డ్ పోర్న్ కేసుల విచారణ కొనసాగుతోంది.
● నిందితులను పట్టుకునేందుకు రాజశేఖర్ బృందం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లొచ్చింది.
● వివిధ ప్రాంతాల్లో ఉన్న నిందితులను జిల్లాకు తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తున్నారు.
● పోర్న్ వీడియోలతో పైశాచికానందం
● పోలీసులకు పట్టుబడ్డ ప్రబుద్ధులు
● నిందితుల్లో విద్యావంతులే ఎక్కువ
● కేంద్ర హోంశాఖ ప్రాథమిక సమాచారం
● ఉమ్మడి తూర్పులో 367 మందిపై కేసులు
● 150 మందికి 41ఎ నోటీసులు
● ఆరు నెలల విచారణలో
నిగ్గు తేలిన నిజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మొబైల్ ఫోన్ నిత్యావసరమైపోయింది. ఇది చేతిలో లేకుండా గుమ్మం దాట లేని పరిస్థితి. నిద్ర లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదు సలి వరకూ ఎవరి చేతిలో చూసినా సెల్ లేకుండా ఉండదు. కొందరు వీటిని వీక్షిస్తూ పక్కదారి పడుతున్నవైనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు విద్యా వంతులు, నడి వయస్సు వారు కూడా మొబైల్‌లో పిల్ల ల పోర్న్ (నీలి) చిత్రాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొబైల్ ఫోన్లలో విచ్చలవిడిగా చూస్తున్న చిన్నారుల నీలి చిత్రాలపై పోలీసు శాఖ లోతైన విచారణ చేపట్టింది. ఇందులో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
స్వచ్ఛంద సంస్థతో కలిసి జాయింట్ ఆపరేషన్
పిల్లల పోర్న్ వీడియోలు చూస్తూ పైశాచికానందం పొందుతున్న ప్రబుద్ధుల నిర్వాకాన్ని సాంకేతికత సాయంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఛేదించారు. చిన్న పిల్లలతో పాడు పనులు చేస్తూ పైశాచికానందం పొందడం, అది చాలదన్నట్టు షూట్ చేయడం, చూస్తూ ఆనందం పొందుతూ మరికొందరికి షేర్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు. ఇటువంటి వారి ఆట కట్టించేందుకు స్వచ్ఛంద సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ)తో పోలీసు శాఖ చేపట్టిన జాయింట్ ఆపరేషన్ ఫలితాన్నిచ్చింది. దీంతో పలు కేసులు నమోదు చేశారు. ఈ వీడియోలు చూస్తున్న, షేర్ చేస్తున్న వారి మొబైల్ నంబర్లు, అడ్రస్‌లు కేంద్ర హోం శాఖ నుంచి పోలీసు ఉన్నతాధికారులకు వచ్చాయి. ఆ సమాచారం జిల్లాకు వచ్చాక కాకినాడ దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో ఆరు నెలల పాటు పోలీసులు పలు రాష్ట్రాల్లో పర్యటించి నిందితుల కూపీ లాగారు.
అరెస్టుల పర్వం
కాకినాడ పోర్టులో పని చేసే ఒక ఉద్యోగిపై కేంద్ర హోం శాఖ నుంచి వర్తమానం వచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలు అతడి మొబైల్ నుంచి సర్కులేట్ అయినట్టు తేలింది. ఆరా తీసేందుకు పోర్టుకు వెళ్లేసరికి నిందితుడు అప్పటికే సొంత రాష్ట్రం రాజస్థాన్ వెళ్లిపోయాడు. ఇక్కడి పోలీసు బృందం రాజస్థాన్ వెళ్లి కేసు నమోదు చేసి తీసుకువచ్చింది. మరో నిందితుడు సామర్లకోట రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఈ పోర్న్ వీడియోలు షేర్ చేసినట్టు తేల్చారు. సామర్లకోట వెళ్లే సరికి నిందితుడు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి కేసు నమోదు చేశారు. గడచిన ఆరు నెలల్లో 367 మందిపై కేసులు నమోదయ్యాయి. మరో 150 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఉన్నారు. ఎంటెక్, మెడిసిన్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు విశ్రాంత ఉద్యోగులు, చివరకు మైనర్లూ ఈ నిర్వాకంలో ఉన్నారని విచారణలో నిగ్గు తేలింది.
‘ఎక్స్‌ప్లాయిటేషన్’పై ఉక్కుపాదం
పెద్దల చిన్ననాటి నగ్న, అర్ధనగ్న చిత్రాలు సేకరించడమే కాకుండా షేర్ చేస్తున్న నిందితుల బండారం బట్టబయలైంది. ఈ తరహా వ్యవహారాలు మూడు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా గుర్తించడం విశేషం. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు ఒక మోస్తరు పట్టణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా చిన్నారుల పోర్న్ వీడియోలు ప్రసార మాద్యమాల ద్వారా సర్కులేట్ అవుతున్నట్టు గుర్తించారు.
మగ పిల్లలకు ప్రమాదమే
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి మనస్తత్వాన్ని చాలా నిశితంగా పరిశీలించాం. కామవాంఛ తీర్చుకోవాలనుకునే వారికి పసిపిల్లల లింగభేదంతో పని లేదు. ఇటువంటి వారి వల్ల ఆడపిల్లలతో పాటు మగపిల్లలకూ ప్రమాదమే. పోర్న్ వీడియోలు చూస్తూ సంతృప్తి చెందేవారి వైఖరి అత్యంత ప్రమాదకరమైనది. ఏ పిల్లల్ని చూసినా వారికి ఈ తరహా ఆలోచనలే వస్తాయి. ఈ స్థితిని మానసిక వైద్య పరిభాషలో పీడియో ఫిలియాగా పిలుస్తారు. ఇటువంటి లైంగిక వాంఛలకు బలయ్యే చిన్నారులకు బయటి వారి నుంచి కంటే సొంత వారు, తెలిసిన వారి నుంచే ప్రమాదం పొంచి ఉంటుంది. న్యూరో హార్మోన్స్ డోపమైన్, సెరటనీన్‌ల ప్రేరేపణ, అసమతుల్యత ఈ తరహా మానసిక స్థితికి కారణం. చిన్నపిల్లలపై వాంఛలు, వీడియోలు వీక్షించే వారు ఆ స్థితి నుంచి తక్షణమే బయటపడాలి. సాధ్యం కాకుంటే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
– డాక్టర్ పాశం రవిశంకర్, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, కాకినాడ
విద్యార్థులే అధికం
చిన్నపిల్లల పోర్న్ వీడియోలు చూస్తూ షేర్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం విస్మయానికి గురి చేసింది. విద్యార్థులతో పాటు మైనర్లు కూడా ఉన్నట్టు గుర్తించాం. నిందితుల్లో ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడ్డట్టు తేలింది. మరికొంత మందికి కనీస అవగాహన లేదు. ఇటువంటి నిర్వాకానికి జైలు, జరిమానా తప్పదు. సరదా కోసమో, హాస్యానికో, లైక్‌లు షేర్ల కోసమో ఈ పనులు చేయడం చట్టరీత్యా నేరం.
– ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, కాకినాడ జిల్లా


