
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు
విద్యార్థులతో మాటామంతీ..
మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్‌చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్‌కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్‌లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులు స్పందించారు.
మహావృక్షం వద్ద 2 గంటలు..
రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్‌ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు.
తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి..
పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్‌వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్‌జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు.

పిల్లలమర్రిలో అందగత్తెల సందడి

పిల్లలమర్రిలో అందగత్తెల సందడి

పిల్లలమర్రిలో అందగత్తెల సందడి