
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికే ఇసుక
భూపాలపల్లి: ప్రజలు తమ గృహ నిర్మాణ, అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖ అనుమతులు ఇచ్చిన మూడు ఇసుక రీచ్‌ల నుంచే ఇసుకను తరలించుకోవాలని చిట్యాల సీఐ మల్లేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల తహసీల్దార్లు, ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇసుక అక్రమ రవాణా జరగకుండా పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ శర్మ నిర్ధేశించిన ధరల ప్రకారమే నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను సరఫరా చేయాలన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల నుంచి ఉచితంగా కూపన్లను పొందవచ్చన్నారు. కూపన్‌ను ట్రాక్టర్ డ్రైవర్ తీసుకొని టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాల్వపల్లి ఇసుక క్వారీల నుంచి ఇసుకను లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక రవాణాకు అవకాశం లేదని చెప్పారు. కొత్తపల్లిగోరి మండల పరిధిలోని గ్రామాలకు రూ.3,500, రేగొండ మండలానికి 3వేలు, చిట్యాల మండలానికి 1,700, భూపాలపల్లి మండలానికి 3వేలు, గణపురం మండలానికి 3వేలు, టేకుమట్లకు 1,500, మొగుళ్లపల్లి మండలానికి 1,500, శాయంపేట మండలానికి 4వేలు మాత్రమే తీసుకోవాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, కూపన్లను దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని సీఐ మల్లేష్ హెచ్చరించారు.
మూడు చోట్ల మాత్రమే తీసేందుకు అనుమతి
చిట్యాల సీఐ మల్లేష్