
ఇళ్ల నిర్మాణం.. ఇష్టారాజ్యం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాల్సిన సెల్లార్లలోనూ షెటర్లు, గదులు నిర్మాణం చేసి అద్దెకు ఇస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
అనుమతి ఇచ్చి వదిలేస్తున్నారు..
పట్టణంలో ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్‌లోని టౌన్ ప్లానింగ్ అధికారులు (టీపీఓ) అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్ చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని అధికారులు చెప్పి వదిలేస్తున్నారు. ఆ తర్వాత నిర్మాణాలను పరిశీలించకపోవడంతో పట్టణంలో చాలాచోట్ల పలువురు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. కేవలం గ్రౌండ్ ప్లోర్‌కు మాత్రమే అనుమతి తీసుకొని జీ ఫ్లస్ 1, 2 నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణదారులు వారికి నచ్చిన విధంగా నిబంధనలు అతిక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
పక్క ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని భూపాలపల్లి–పరకాల జాతీయ రహదారిపై నిర్మించిన భవనం. సెల్లార్ నిర్మాణం చేపట్టి సెల్లార్‌పై మరో మూడు అంతస్తులు వేశారు. నిబంధనల ప్రకారం సెల్లార్‌లో షెటర్లు ఏర్పాటు చేయకుండా పార్కింగ్ కోసం వినియోగించుకోవాలి. అదే ప్రాంతంలో మరో మూడు భవనాల్లోనూ సెల్లార్లు నిర్మించి షెటర్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్‌లో నిర్మించిన ఓ భవనంలోనూ సెల్లారులో చిన్న చిన్న రూమ్‌లు ఏర్పాటు చేశారు.
అమలుకాని నిబంధనలు
సెట్ బ్యాక్ కాకుండానే నిర్మాణాలు
సెల్లార్లలో షెటర్ల ఏర్పాటు
చోద్యంచూస్తున్న అధికారులు

ఇళ్ల నిర్మాణం.. ఇష్టారాజ్యం