
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తుందని, నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దుచేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు–3లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయా సంఘాల నాయకులు రాజ్‌కుమార్, మంద నర్సింగరావు, పసునూటి రాజేందర్, బడితెల సమ్మయ్య ముఖ్యఅతిథులు పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను విభజించి కార్మిక సంఘాలు ఉండవదనే ధోరణిలో బీజేపీ చట్టం చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేయకుండా తల్లిలాంటి సింగరేణిని బీజేపీ ప్రభుత్వం మోసంచేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 20న బీఎంఎస్ మినహా ఐదు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల కార్మికులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంఘాల నాయకులు మోటపలుకుల రమేష్, మధుకర్‌రెడ్డి, రాజయ్య, రాంచందర్, సుధాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, విజేందర్, శంకర్, పాశం పాల్గొన్నారు.