ఒక్క పాటతో కోట్లాది మంది ప్రేక్షకుల మనస్సు కరిగించి.. కంట కన్నీరు పెట్టించిన గాయకులు వీళ్లు. కుటుంబ సంబంధ బాంధవ్యాలను తమ గానామృతంతో తెలియజేసిన వీరు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. ‘మాకంటూ సొంత బలగం లేదు.. మీరే మా ‘బలగం’. మా కంట కన్నీరు తుడవండి’ అని దీనంగా వేడుకుంటున్నారు. బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’ అంటూ పాట పాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. మొగిలయ్య.. రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. ‘తోడుగా మా తోడుండి. మా ఇంటి దీపాన్ని కాపాడండి’అంటూ కొమురమ్మ రెండు చేతులు ఎత్తి అర్థిస్తోంది.