ఎడమొహం..పెడమొహం
పార్టీల్లో చీలికలు.. పల్లెల్లో చర్చలు
పల్లెల్లో వర్గం ఏదైనా ప్రేమ, ఆప్యాయత పలకరింపులకు ఎక్కడా మాట రానివ్వరు. కానీ ఎలక్షన్ల నేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఊరిలో కలిసి తిరిగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెండు కూటములుగా చీలిపోయి, గెలుపు ఎవరిదో చూద్దాం అనే ఎమోషన్‌లో బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆప్యాయంగా పిలుచుకున్న వారు ఇప్పుడు ఒకరిని ఒకరు ఓరకంట చూపుతో చూసుకుంటూ రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సరికి, జనగామలో రెండో విడత మొదలైంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్వతంత్రులు, పార్టీ అభ్యర్థులు, తిరుగుబాటు నేతల హడావిడి పార్టీ అధినాయకత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు బుజ్జగింపులు, మరోవైపు అధికారిక అభ్యర్థుల ప్రకటన జిల్లా రాజకీయాల్లో సరికొత్త ఊపును తీసుకొస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎవరిని బుజ్జగిస్తారు, ఎవరు బరిలో నిలుస్తారు అనే చర్చ వినిపిస్తోంది. ఈ ఎన్నికలు మాత్రం పల్లె రాజకీయాల్లో కొత్త రణరంగానికి నాంది పలుకుతున్నాయి.
జనగామ: ‘అన్న, తమ్ముడు, బాబాయి, మామా, అల్లుడు..’ వరుసలు పెట్టుకుని ఆప్యాయంగా పిలుచుకునే నాయకులు ఇప్పుడు ఎడమొహం..పెడమొహంగా మారిపోయారు. పల్లె రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికలు మంటపుట్టిస్తున్నాయి. బుజ్జగింపుల పర్వం పీక్ స్టేజీకి చేరకోగా..వెనక్కి తగ్గేదేలేదంటూ ఆశావహులు కరాఖండీగా తేల్చిచెబుతున్నారు. ‘అన్నా ఒక్కసారి నామినేషన్ తిరిగి తీసుకోరాదే.. ఈసారి నాకు అవకాశం వచ్చింది.. మరోసారి మీకు అండగా నిలబడతాం..’ అంటూ చాలాచోట్ల వేడుకోళ్లు.. బతిమిలాటలు కనిపిస్తున్నాయి. మాట వినే ప్రసక్తే లేదు...బరిలో నిలవాల్సిందే అంటూ పోటీకి కాలుదువ్వుతున్నారు. పార్టీ శ్రేణులు, రెండోస్థాయి నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి లోని ప్రధాన రాజకీయ పార్టీలు 90 శాతం అభ్యర్థుల జాబితాను ప్రకటించి, డబుల్ పోటీ ఉన్న పంచాయతీలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
రంగంలోకి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జెండా ఎగురవేయాలని ఎవరికివారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగి పార్టీలో మంచి గుర్తింపు ఇస్తాం, నామినేటెడ్ పోస్టుల్లో ప్రయార్టీ ఉంటుందని ఒకరి తర్వాత ఒకరిని సముదాయిస్తున్నారు. కానీ కొంతమంది ఆశావాహులు మాత్రం గెలుస్తామనే బలమైన నమ్మకంతో బరిలోనే ఉంటామనే సంకేతాలు ఇస్తుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
యువ ఓటర్లే కీలకం
పంచాయతీ ఎన్నికల్లో యువఓటర్లదే కీలకం కానుంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా చోట్ల యువకెరటాలకు సంబంధించి సర్పంచ్, వార్డుసభ్యులు ఏకగ్రీవం కాగా, ఓట్ల సమయంలో సైతం వీరి పాత్ర ప్రధానంగా ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అనేక గ్రామాల్లో యువత గ్రూపులుగా ఏర్పాటై, తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. యువతను తట్టుకునేందుకు రాజకీయ అనుభవంతో సీనియర్లు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా పల్లెల్లో అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య, దోమల స్వైర విహారం ఇలా అనేక సమస్యలపై బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న ఆశావహులను పట్టుకుని గెలిపిస్తే ఏం చేస్తావంటే ఇప్పుడే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయ పార్టీలకు తలనొప్పిగా పోటీదారులు
పల్లె రాజకీయాల్లో మంటపెడుతున్న లోకల్ వార్
బరిలో నిలిచేందుకు బుజ్జగింపుల పర్వం
ఎడమొహం..పెడమొహం


