లోకల్ ధమాకా!
ప్రభుత్వానికి భారీ ఆదాయం..
లిక్కర్ మార్టులపై ఆసక్తి
జనగామ: జిల్లాలో నూతన మద్యం పాలసీ సోమవారం(డిసెంబర్ 1) నుంచి అమలుకానుంది. ప్రస్తుత వైనన్స్‌్ షాపుల లైసెన్స్ గడువు ముగియగా, ఉదయం 10 గంటల నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు తెరుచుకోనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రారంభం కావడం వ్యాపారులకు కలిసిరానుంది. ఎన్నికల వేళ గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల్లో రద్దీ పెరగడం, రాజకీయ కార్యకలాపాలు ఊపందు కోవడం వైన్స్ షాపుల వద్ద అమ్మకాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
స్థానికంతో లాభాలు..
నూతన మద్యం షాపుల ప్రారంభంలోనే పంచాయతీ ఎన్నికలు నడుస్తుండడంతో వ్యాపారులకు తొలిరోజు నుంచే లాభాల పంట పండనుంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారం నుంచి గ్రామాల్లో అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఊరేగింపులు, రాత్రి వేళ చర్చలు పెరగడం మద్యం డిమాండ్‌ను పెంచేస్తుంది. ఎన్నికల సీజన్, కొత్త పాలసీ డబుల్ ఇంపాక్ట్ వల్ల అమ్మకాలలో ఉండే పెరుగుదల అంచనాలకు మించి దాటనుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఇప్పటికే స్టాక్‌ను పెంచేసుకోగా, మరికొందరు ప్రీమియం బ్రాండ్ల సరఫరాలను భారీగా ఆర్డర్ చేసినట్టు సమాచారం. వ్యాపారులకు ఎలక్షన్లు అరుదైన గోల్డెన్ ఆఫర్‌గా మారే అవకాశముందని పలువురు నాయకులు అంటున్నారు.
సిండికేట్.. చర్చ
వైన్స్‌షాపుల కేటాయింపులతో పాటు మండలాల పరిధిలో ‘సిండికేట్’ ప్రభావం కొత్తగా చర్చనీయాంశమైంది. లాభదాయకమైన ప్రాంతాలపై ఒకే గ్రూపు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త పాలసీ అమలుతో మారుతున్న వ్యాపార సమీకరణలు, వైన్స్ యజమానుల వ్యూహాలు జిల్లాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇది రాబోయే నెలల్లో రిటైల్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త దుకాణం కలిసొచ్చిన వ్యాపారులు సేల్ కౌంటర్ మేనేజర్లు, టీమ్‌ల నియామకం, ఇంటీరియర్ సెట్‌అప్, స్టాక్ రిప్లేస్‌మెంట్, డిజిటల్ మీటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేస్తున్నారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 మద్యం దుకాణాలకు గాను 1,697 దరఖాస్తులు జిల్లాలో మద్యం వ్యాపారంపై ఉన్న పోటీని మరోసారి రుజువు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.50 కోట్ల 95 లక్షలు ఆదాయం రావడం గమనార్హం. 2025–27 రెండేళ్ల కాలానికి అక్టోబర్ 28న జిల్లాలోని 50 దుకాణాలకు లాటరీ నిర్వహించగా, అదృష్టం కలిసిన నిర్వాహకులు ఇప్పటికే షాపుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్లలో పాతషాపుల్లో రూ.1100కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేయడం గమనార్హం.
కొత్త వైన్స్‌కు పంచాయతీ ఎన్నికల గిరాకీ
నేటి నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం
లాభాల లెక్కలు–సిండికేట్‌పై చర్చలు
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీల పరిధి లో వైన్స్ షాపుకు అదనంగా రూ.5 లక్షల లైసెన్స్ ఫీజుతో లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో పలువురు వ్యాపారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం జనగామ నియోజకవర్గంలో మూడు లిక్కర్ మార్ట్‌లు ఉండగా, కొత్త పాలసీతో మరిన్ని ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా లిక్కర్ మార్టుల్లో ధరల్లో మార్పులు, బ్రాండ్ల లభ్యత, సేవల ప్రమాణాల పెంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు అత్యధిక సేల్ కోసం రహస్యంగా ప్రత్యేక ఆఫర్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు, అధునాతన డిస్‌ప్లే ర్యాక్స్ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు.


