
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది.
నిషేధించిన జలపాతాలు ఇవే..
వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్‌లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు.
రక్షణ లేకపోవడంతోనే..
దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు.
తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు.
నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు
దట్టమైన అటవీప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి.
– ద్వాలియా, ఎఫ్‌డీఓ, వెంకటాపురం(కె))
●
బొగతకు రావాలంటూ పిలుపు
అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం
రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం
దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది
బొగత జలపాతానికి రావాలంటూ పిలుపు

ఆ.. జలపాతాల సందర్శన నిషేధం

ఆ.. జలపాతాల సందర్శన నిషేధం

ఆ.. జలపాతాల సందర్శన నిషేధం