
సమాజ హితమే వైద్యుల ధ్యేయం
జనగామ: సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు రక్తదానం మరొకరికి ప్రాణం పోస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ఐఎంఏ సహకారం అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అ భినందనీయమన్నారు. సీనియర్ డాక్టర్ డి.లవకుమార్‌రెడ్డి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.కరుణాకర్‌రాజు, వైద్యులు అన్వర్, ఏ.శ్రీనివాస్, కన్న పరశురాములు, కల్నల్ మాచర్ల భిక్షపతి, కృష్ణ జీవన్ బజాజ్, కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి దేవరాజ్, డాక్టర్ సీహెచ్.రాజమౌళి, కృష్ణ, వెంకటేశ్వర్లు, కనకరాజు, తదితతరులు పాల్గొన్నారు.
పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ
జనగామ రూరల్/లింగాలఘణపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం కింద మంగళవారం తమిళనాడు నుంచి సర్పంచ్‌లు, బ్లాక్ ప్రెసిడెంట్, అధికారులు జిల్లాకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో డీపీ ఓ స్వరూప ఆధ్వర్యంలో తడి పొడి చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీలో మొక్కల పెంపకం గురించి వివరించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడిచెత్త నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయం, నర్సరీలో మొక్కల పెంపకం, భూగర్భ జలాల పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, పంటల సాగు, శానిటేషన్ నిర్వహణతో సీజనల్ వ్యాధులను అరికడుతున్న తీరును సర్పంచ్ బృందానికి వివరించారు.
డాక్టర్స్‌డేలో కలెక్టర్ రిజ్వాన్ బాషా