
గ్రీన్ సిగ్నల్
జనగామ: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025–26 నూతన వైద్య విద్యాసంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల (ఎంబీబీఎస్) పునరుద్ధరణకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ మంజూరుకు ఎన్‌ఎంసీ నిబంధనలను అనుసరించి మెడికల్ కళాశాల వివరాలు, సమగ్ర డేటాను అప్‌లోడ్ చేయాలని 2024 నవంబర్ 1న పబ్లిక్ నోటీసు జారీ చేశారు. కళాశాలకు సంబంధించిన నిపుణులు సమర్పించిన నివేదిక ఆధారంగా లోపాలను గుర్తిస్తూ 2025 మే 3న జాతీయ వైద్య కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అధ్యాపకులకు సంబంధించి తక్కువ హాజరు శాతం, 420 పడకలకు గాను 410, కాడవర్ సంఖ్య 10కి గాను 7, అందుబాటులో లేని సీటీ స్కాన్, ఎమ్మారై, మైనర్, మేజర్ ఓటీల సంఖ్య పెంచడం (ఆపరేషన్ థియేటర్లు), మృతదేహాల కొరత తదితర లోపాలు ఉన్నట్లు షోకాజ్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారీగా గుర్తించిన లోపాలను సరి దిద్దేందుకు వివరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను నిపుణుల ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వం అందించిన నివేదిక ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) 2025–26లో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగు నెలల లోపు లోపాలను సరిదిద్దుకోవాలని అందులో పేర్కొన్నారు. నిబంధనల మేరకు కాలపరిమితి ముగిసిన వెంటనే మెడికల్ కళాశాల నిర్వహణకు సంబంధించి వైద్య విద్య ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో లోపాలు అలాగే కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఈ వైద్యవిద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్‌ఎంసీ చూపించిన లోపాల్లో సీటీ స్కాన్ సేవలు వారం రోజుల్లో ప్రారంభం కానుండగా మృతదేహాలకు సంబంధించి మరో నాలుగు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాకల్టీకి సంబంధించి ఖాళీ లను సైతం భర్తీ చేస్తున్నారు. అధ్యాపకుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్‌ను సైతం అమలులోకి తీసుకు వస్తున్నారు. 100 ఎంబీబీఎస్ సీట్లకు గాను 15 శా తం జాతీయ స్థాయి, 85 శాతం రాష్ట్రాస్థాయిలో అ డ్మిషన్లు ఉంటాయి. ఈ విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడు తూ 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు మంజూరు వచ్చిందన్నారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
వైద్య కళాశాలకు షరతులతో కూడిన అనుమతులు
ఊపిరి పీల్చుకున్న అధికారులు