
భూగర్భ జలాలు పడిపోవడంతో చిన్నగా పోస్తున్న బోరు
పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు శివరాత్రి చంద్రయ్య. చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామం. వ్యవసాయ బావిపై ఆధారపడి తనకున్న ఎకరంన్నర పొలంలో వరి సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావిలో నీరు తగ్గిపోయింది. 15రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండడం, బావిలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వరికి సరిపడా నీరు అందడంలేదు. గొలుసు మీద ఉన్న వరి పంట దిగుబడులపై రైతు ఆందోళన చెందుతున్నాడు.
జనగామ: ఇంకా మార్చి నెల కూడా పూర్తికాలేదు.. అసలైన ఎండలు ఏప్రిల్, మే నెలలోనే.. కానీ జిల్లాలో అప్పుడే భూగర్భజలాలు పడిపోతున్నాయి. 30రోజుల్లో 2.04 మీటర్లు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది. గతేడాది మార్చిలో 6.98 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2023 జనవరిలో 5.57 మీటర్లు.. ఫిబ్రవరిలో 6.90 మీటర్లు.. మార్చిలో 7.61 మీటర్లకు పడిపోయాయి. యాసంగి వరి పంట పొట్ట దశలో ఉండగా పరిస్థితి ఏంటనే ఆందోళన రైతుల్లో నెలకొంది. జిల్లాలో యాసంగి సీజన్‌లో 1.35లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 1.30లక్షల ఎకరాల్లో వరిసాగు అయింది. దీంతో సాగు నీటి అవసరాలు లెక్కకు మించి పెరిగిపోయాయి. జిల్లాలో ఏడు రిజర్వాయర్లతో పాటు 995 చెరువులు, మినీ కుంటలు ఉన్నాయి. ఇందులో 143 చెరువుల్లో 25 శాతం, 102 చోట్ల 25 నుంచి 50శాతం, 126 చోట్ల 50 నుంచి 75 శాతం, 75 నుంచి 100 శాతం 624 చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ ధృవీకరించింది. రిజర్వాయర్లలో సగానికి సగం నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో చెరువులు నింపే కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సీజన్‌లో దేవాదుల ద్వా రా గోదావరి జలాల రాక ఆలస్యం కావడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో పెరిగింది..
పాలకుర్తిలో తగ్గింది..
గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు చూస్తే 0.63 లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మాసం ఒక్క నెలలోనే 2.04మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫిబ్రవరి, మార్చినెలతో లెక్కిస్తే... 0.71 మీటర్ల లోతుకు పడిపోయాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 2.86 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. పాలకుర్తిలో 1.74 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి వచ్చేసరికి అన్ని మండలాల పరిధిలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
30రోజుల్లో 2.04 మీటర్ల లోతుకు..
రిజర్వాయర్లలో తగ్గిన నీటి మట్టం
పొట్టదశలో వరి..
ఆందోళనలో అన్నదాతలు
పదిగుంటలకే సాగునీరు..
రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. ఒక్క బోరుతో పంటకు సాగు నీరు అందించిన. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో 10 గుంటల పొలానికి మాత్రమే సాగునీరు అందుతోంది.
– ఆకుల శ్రీనివాస్, రైతు, బొంతగట్టు నాగారం, తరిగొప్పుల

