
ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు
జగిత్యాల/మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు పెద్ద సమస్యగా మారాయి. సంబంధిత యజమానులు వాటిని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల వాటిలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరగడమే కాకుండా చాలాచోట్ల వరద నీటి నిల్వతో మురికి గుంటలుగా తయారయ్యాయి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా వీటి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్య ఉన్న కాలనీలు ఇవే..
● బల్దియాలోని హన్మాన్‌నగర్, బీడీ కాలనీ, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, సిద్ధి వినాయనగర్, బాలకృష్ణనగర్, అర్బన్ హౌజింగ్ కాలనీల్లో వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఇవి ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి.
● ప్రధానంగా వాటిల్లో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి పాములకు ఆవాసంగా మారుతున్నాయి. అవి ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
● అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు వాటిల్లోకి వచ్చి చేరుతోంది. దీంతోపాటు వరద నీరు కూడా చేరి నిల్వ ఉండడంతో అవి మురికి కుంటలుగా తయారవుతున్నాయి.
● ఇలాంటి వాటితో దుర్వాసనను వెదజల్లడంతో పాటు దోమల బెడద ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు..
● ఖాళీ ప్లాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అవి మున్సిపల్ అధికారులకు పట్టడం లేదు.
● వాస్తవానికి నిబంధనల ప్రకారం..ఖాళీ ప్లాట్ల యజమానులు వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి మొక్కలు పెరగకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా.. మురుగు నీరు నిలిచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
● ఈ విషయంలో నిర్లక్ష్యం చూపే వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వాలి. దీనికి స్పందించకుంటే జరిమానా విధించే అవకాశముంటుంది.
● కానీ అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
● ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. గతేడాది పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు.
● కొన్ని రోజులుగా వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. అపరిశుభ్రతకు కారణమవుతున్న ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాకేంద్రంలో..
● జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ.. 48వార్డులు.. లక్షకు పైగా జనాభా ఉన్నా పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో చెత్తను ఖాళీ స్థలా ల్లోనే పడేస్తున్నారు. మున్సిపాలిటిలో నాలుగు జోన్లు ఉన్నాయి. వార్డుకో ఆటో, జోన్‌కు మూడు ట్రాక్టర్లు నడుస్తుంటాయి. 48 వార్డులకు అవి సరిపోవడం లేనట్లు తెలుస్తోంది.
కన్పించని డంపర్‌బిన్స్
● ప్రధానమైన చోట్ల డంపర్‌బిన్స్ ఏర్పాటు చేస్తే చెత్త సమస్య ఉండదు. గతంలో ప్రతిచోట డంపర్‌బిన్స్ పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటినీ ఎత్తివేశారు. దీంతో ఖాళీ స్థలాల్లోనే చెత్త పడేస్తున్నారు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఈ చిత్రం మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సిద్ధివినాయకనగర్‌లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లు. వీటిల్లో ఎక్కడికక్కడ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాముల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసే విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోని గోవిందుపల్లికి వెళ్లే రహదారి.
ఖాళీ స్థలం మొత్తం చెత్తతో నిండిపోయింది. బల్దియా ట్రాక్టర్లు, ఆటోలు రాక డ్రైనేజీలు తీయడం లేదు. చెత్త తీసుకెళ్లకపోవడంతో ఖాళీ స్థలంలోనే పడేస్తున్నారు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట ఉండలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రం మెట్‌పల్లి బల్దియా పరిధిలోని హన్మాన్‌నగర్‌లోనిది. ఈ కాలనీ నూతన గృహాల నిర్మాణంతో విస్తరిస్తోంది. ఇందులోనూ అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని ప్లాట్లల్లో మొక్కలతో పాటు మురుగునీరు వచ్చి చేరింది. ఈ సమస్యతో పరిసరాలు కంపు కొడుతుండడమే కాకుండా దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కొత్తబస్టాండ్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ సంది. ఇక్కడ కమిషనర్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఈ సమీపంలోనే అత్యధిక చెత్త పడేస్తున్నారు. కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది నర్సింగ్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం. ఇందులో మట్టి, చెత్తాచెదారం పడేస్తున్నారు. దుర్వాసన వస్తోందని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. ఖాళీ స్థలం కావడంతో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు.
ఇది బైపాస్ ప్రధాన రోడ్. డ్రైనేజీని ఆనుకునే చెత్త వేస్తున్నారు. విరిగిపోయిన కూలర్లు, ఫ్యాన్లు, చెడిపోయిన బెడ్స్, చిని గిన బట్టలు ఇలా అనేక వస్తువులు అక్కడే పడేస్తున్నారు. అటు వైపు వెళ్తేనే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చూడటంతోపాటు, డంపర్‌బిన్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు

ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు