
పేకాటపై సీసీఎస్ పోలీసుల నిఘా
● జిల్లాలో జోరుగా మూడుముక్కలాట ● చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
జగిత్యాలక్రైం: జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు నిఘా పటిష్టం చేసి.. రోజు కోచోట పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి నగదు సీజ్ చేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. పేకాటతో వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. నిత్యం జూదం కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపో యి ఇ బ్బంది పడుతున్నాయి. కొంతమంది ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి పేకా డుతూ తీవ్రంగా నష్టపోతున్నారు.
మామిడితోటలు, అడవుల్లో అడ్డా
పేకాట రాయుళ్లకు మామిడితోటలు, అడవులు అడ్డాలుగా మారాయి. కొందరు నిర్వాహకులు కొంత మంది పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకుని వారికి విందు, వసతులు ఏర్పాటు చేసి అక్కడికే పిలిపిస్తూ పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరాల వద్ద ఉన్న రహదారులపై రహస్యంగా కాపలా ఏర్పాటు చేసుకుని పోలీసులు వస్తే సమాచారం రాగానే అక్కడి నుంచి పారిపోతున్నా రు. కొంతమంది మహారాష్ట్రలోని అప్పారావుపేట, బోరి, బిరేళీ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు.
ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు
జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో.. మామిడి తోటల్లో, ఫామ్ హౌస్‌లను వేదిక చేసుకుని పోలీసుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. పోలీసులు జూదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.
నిఘా పెంచిన సీసీఎస్ పోలీసులు
జిల్లావ్యాప్తంగా సీసీఎస్ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుబడిన, నిర్వాహకుల వివరాలు సేకరిస్తూ సాంకేతికతతో సీసీఎస్ పోలీసులు వారిపై దాడులు చేస్తూ పేకాట రాయుళ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు.
పారిపోతున్న జూదరులు
రహస్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో, మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేయగా, చాలామంది జూదరులు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్నారు. పోలీసులు దొరికిన వారి నుంచి కూపీ లాగడంతో పాటు అక్కడున్న వాహనాలను స్వాధీనం చేసుకుని అసలు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.
ఏడాది కేసులు నిందితులు పట్టుకున్న సొమ్ము(రూ.లలో)
2022 109 536 16,91,045
2023 78 473 18,66,696
2024 89 602 19,40,681
2025 71 447 16,68,520