
వారాహిమాతకు లక్ష పుష్పార్చన
కోరుట్ల: పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహినవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు కట్ట నారాయణ, అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘సిగాచి’ మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలి
జగిత్యాలటౌన్: హైదరాబాద్ శివారు పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. బుధవారం లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. సిగాజి రసాయన పరిశ్రమలో పేలుడు ఘటన భోపాల్ ఘటనను తలపించిందన్నారు. 46మందికి పైగా మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ యాజమాన్యంపై హత్యానేరం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీస్తాం
వెల్గటూర్: తెలంగాణ రావాల్సిన నిధులు, హక్కులపై కేంద్రంపై పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండలకేంద్రంలో పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కరించాల్సిన బీజేపీ చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, దీనిపై పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు తిరుపతి, ఉదయ్, శ్రీకాంత్‌రావు, సందీప్ రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు.