
నాలా.. ఇలా ఉంటే ఎలా?
● జిల్లాకేంద్రంలో ప్రమాదకరంగా నాలాలు ● సిల్టు తీయరు.. పిచ్చిమొక్కలు తొలగించరు ● ఏ కాలువ నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి ● ఇళ్లలోకి నీరు చేరుతోందని ఆవేదన ● జగిత్యాల ప్రజలకు ముంపు ముప్పు ● తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు పెరగడం, సీల్టు తీయకపోవడంతో వర్షం కురిస్తే డ్రైనేజీ పొంగి మురుగునీరు ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. ఏ కాలువ నీరు ఎటు నుంచి వెళ్తోందో తెలియని పరిస్థితి. వర్షాకాలానికి ముందే చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా భారీ వర్షాలు కురిస్తే డ్రైనేజీలు పొంగే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. గంజ్‌రోడ్ నుంచి వెళ్లే నాలా 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలా పరిసరాల్లోని ప్రజలు దుర్గంధం, దోమలు, పందులు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారు. చింతకుంట నుంచి వచ్చే అతిపెద్ద నాలా శంకులపల్లి కాలనీ వరకు వెళ్తుంది. పిచ్చిమొక్కలు, తుంగ పెరగడంతో కాలువ కన్పించని పరిస్థితి నెలకొంది. జాంబాగ్ ప్రాంతంలో ఉన్న కాలువ ప్రజల కు ఇబ్బందికరంగా మారింది. వెంకటాద్రినగర్‌లోని కాలువ పొంగినప్పుడు కాలనీవాసులు వరద తగ్గే వరకు జగిత్యాలకు రాలేని పరిస్థితి నెలకొంది. గంజ్‌రోడ్, గోవిందుపల్లి, మోతె, చింతకుంట చెరువు సమీపంలో నాలాల వెంట రక్షణగోడ లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు అటుగా వెళ్తే అందులో పడే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక నిధులతో నాలాల్లో సీల్టుతీసి, మరమ్మతు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇది జిల్లా కేంద్రంలోని చింతకుంట నుంచి వచ్చే ప్రధానమైన నాలా. శంకులపల్లి వరకు ఉంటుంది. పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు వ్యర్థాలు పడేయడంతో కుంటను తలపిస్తోంది. శంకులపల్లి ప్రాంతంలో పొలాలు ఉండటంతో డ్రెయినేజీ నీరంతా పొలాల్లో పారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలగించాలని కాలువ వెంట ఉన్న కాలనీవాసులు కోరుతున్నారు.
ఇది గోవిందుపల్లి ప్రాంతంలోని ధరూర్ నుంచి వచ్చే పెద్ద కాలువ. వర్షం వచ్చిందంటే నాలా ఉప్పొంగి పట్టణంలోని వెంకటాద్రినగర్‌కు రాకపోకలు స్తంభించిపోవాల్సిందే. ఈ కాలువలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చిరిగిన పరుపులు, బీరువాలు, పాతవస్తువులన్నీ ఇందులోనే పడేస్తున్నారు. ఫలితంగా వర్షం కురిస్తే నాలా పొంగి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది.
ఇది కూడా గంజ్ నుంచి వెళ్లే ప్రధానమైన నాలా. సిటీ మధ్యలో ఉంటుంది. కొన్ని చోట్ల కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వర్షాకాలంలో నాలా పొంగితే ప్రమాదాలు జరిగే అవకాశముంది. సీల్టు తీయకపోవడం, పిచ్చిమొక్కలు అత్యధికంగా ఉండటంతో కాలువ వెంట ఉండేకాలనీవాసులు దోమలతో సావాసం చేస్తున్నారు.
ఇది గంజ్‌రోడ్‌లోని నాలా. పూర్తిగా సీల్టుతో నిండిపోవడంతో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. కాలువ సిటీమధ్యలో ఉండడంతో వర్షం పడితే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీల్టు తీసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నాలా.. ఇలా ఉంటే ఎలా?

నాలా.. ఇలా ఉంటే ఎలా?

నాలా.. ఇలా ఉంటే ఎలా?