
చిన్న మొక్కలు నాటొద్దు
జగిత్యాల: వన మహోత్సవంలో భాగంగా చిన్నమొక్కలు కాకుండా పెద్దవి నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వనమహోత్సవం, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ ఏడాది 48 లక్షలకుపైగా మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈనెల 30 వరకు స్థలాలు ఎంపిక చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు, కర్రలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం ముగ్గు పోయించాలని సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని, నీటి నిలువ ఉన్న చోట ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు.
పారిశుధ్య లోపంపై కలెక్టర్ అసహనం
కొడిమ్యాల: మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని, వంటశాలలో శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో స్వరూపరాణి, సిబ్బంది ఉన్నారు.
సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో జూలై 7వరకు దరఖాస్తు చేసుకోవాలని, 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.