
పారిశుధ్య పనులకు నేనూ వస్తా..
ఇబ్రహీంపట్నం: గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే రియల్ హీరోలు అని, సర్పంచులు లేకున్నా.. శ్రద్ధతో శ్రమించి పనిచేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వర్షకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వారం పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని, ఇందులో తానూ పాల్గొంటానని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు ఎఫ్‌డీఆర్ కింద నిధులు మంజురైనా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అధికారులను ప్రశ్నించారు. చెరువులు, కుంటల మరమ్మతుకు నిధులు మంజూరు చేయించినా.. సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సంతకం చేయించినా పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.
తిమ్మాపూర్, ఎర్రాపూర్ గ్రామాలకు 33 కేవీ సబ్‌స్టేషన్లు మంజురైనట్లు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దని సూచించారు. అమ్మక్కపేట సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం పనులు 18 నెలలుగా నిలిచిపోయాయని, అధికారులు ఫెయిలయ్యారని వివరించారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏడీఈ మనోహర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఇరిగేషన్ డీఈ దేవానందం, ఎంఈవో మధు, ఎంపీవో రామకృష్ణరాజు పాల్గొన్నారు.
సమయానికి బస్సులు వెళ్లేలా చూడాలి
కోరుట్ల రూరల్: విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేలా సమయానికి బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీసి అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మరిన్ని రిక్వెస్ట్ స్టాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌ఎం రాజు, డీవీఎం భూపతిరెడ్డి, కోరుట్ల డీఎం పాల్గొన్నారు.