
భూ సేకరణలో వేగం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: జిల్లాలో వివిధస్థాయిలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ భూసేకరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పెండింగ్ పనులతో పాటు, ఇతర ప్రాజెక్ట్‌ల కింద మిగిలిన భూసేకరణ పనులను చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురియకముందే అన్ని కాలువలకు మరమతులు చేయించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు లాంటి పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఇరిగేషన్ అధికారి రమేశ్ పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్‌బెడ్‌రూం ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. త్వరలోనే లబ్ధిదారుల కోసం ఒక అంగన్‌వాడీ కేంద్రంతో పాటు, పీహెచ్‌సీ కేంద్రం సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్డీవో మధుసూదన్, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు
చర్యలు తీసుకోవాలి
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వైద్యశాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి లింగంపేటలో పర్యటించారు. రాబోయే మూడు నెలల పాటు పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలన్నారు. జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.