
బల్దియా స్థలాలు కబ్జా
జగిత్యాల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ అనుమతి లేకుండా ఎవరైనా ఇల్లు నిర్మించుకున్నా.. సెట్‌బ్యాక్ లేకున్నా.. ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారు. కానీ మున్సిపల్ స్థలాలు యథేచ్ఛగా కబ్జా చేసుకుంటే మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్మాణాలను ఎలా కూల్చివేస్తున్నారో స్థలాలను ఆక్రమించుకున్న వారిని కూడా వెళ్లగొట్టి స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలను అద్దెకు తీసుకుని.. దాని ఎదుట మరో దుకాణం పెట్టి.. రేకుల షెడ్డుతో కబ్జా చేస్తున్నారు. ఇది అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ
జిల్లాకేంద్రంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు భారీగా వెలిశాయి. ఇటీవల వ్యాపారాలు పెరగడంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం.. డ్రైనేజీలపై కప్పులు వేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉద్యానవనాన్ని ఆనుకుని ఉన్న స్థలం కోట్లాది రూపాయల విలువైనది. ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా బల్దియాకు అత్యధిక ఆదాయం చేకూరేది. కానీ మున్సిపల్ అధికారులు ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక చోట్ల అక్రమాలు అత్యధికంగా ఉన్నాయి.
ఆదాయానికి భారీగండి
ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అధికారులు పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో ఆ ఆదాయానికి గండి పడుతోంది. గతంలో అంగడిబజార్‌లో ఉన్న ఖాళీ స్థలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపు రూ.4 నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లోని అక్రమణలను తొలగిస్తే జిల్లాకు ఆదాయం అధిక సంఖ్యలో లభిస్తుంది. కొన్ని చోట్ల షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించినప్పటికీ ఆశించిన మేర నిర్మాణం చేపట్టలేదు.
మున్సిపల్‌కు కొంత మేరే చెల్లింపులు
మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకుని అందులో వ్యాపారం నిర్వహించుకోగా.. మున్సిపల్‌కు ఎంతో కొంత మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిసింది. బల్దియా అధికారులు సైతం ఫీజులు తీసుకుని మిన్నుకుంటున్నారు. వారు మాత్రం మున్సిపల్‌కు నామమాత్రంగా ఫీజులు తీసుకుని అద్దెలు తీసుకుంటున్నారు. విలువైన స్థలాల్లో అక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
షెటర్ల ముందు షెడ్లు..
షెటర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని ఆనుకుని మరో షెటరంతా రేకులషెడ్డు వేసి సామాను ముందు పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రజలు నడిచేందుకు ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో టవర్‌సర్కిల్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. ఇటీవల నూతనంగా షాపింగ్‌మాల్స్ వెలువగా వారు సైతం ఎలాంటి ట్రాఫిక్‌కు సంబంధించినవి ఏర్పాటు చేసుకోకపోవడంతో వాహనాలు పెట్టుకునేందుకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
విలువైన స్థలాల్లో ఆక్రమణలు
కాంప్లెక్స్ నిర్మిస్తే అధిక ఆదాయం
చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
ఈ చిత్రంలో కన్పిస్తున్నది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి సంబంధించిన అత్యంత విలువైన స్థలం. ఈ స్థలంలో పండ్ల దుకాణాలు, హోటళ్లు, టీస్టాల్స్, దుకాణాలు అక్రమంగా వెలిశాయి. ఇంత విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతోపాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు.

బల్దియా స్థలాలు కబ్జా