
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
● 2021లో జననాల కన్నా మరణాలు అధికం ● ఆ మరణాల్లో పురుషులే ఎక్కువ ● మృతులంతా 65 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వారే ● ఐరాస ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటాలో వెల్లడి ● 2022లో తిరిగి పుంజుకున్న జననాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదిలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్‌ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి.
సీఆర్‌ఎస్ డేటా ప్రకారం..
2021లో నమోదైన జనన మరణాలను పరిశీలిస్తే.. 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు కాగా, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం మంది అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి.
పురుషుల్లోనే మరణాలు అధికం
డేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరణాల రికార్డులో తెలంగాణ ముందంజలో ఉంది. 75శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్‌ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7,647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు.